పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

నదిగనుక దొరతనమువారి బడికిపిల్లలను బంపువారికందఱికిని శిక్షవిధింప వలయునని శ్రీజగద్గురువులవారితో మనవిచేసి, తత్క్షణము నాయజమానురాలిని గురుసాన్నిధ్యమునుండి గెంటించివేసెను. జగద్గురువుల వారును ధనలక్ష్మీప్రియురాండ్రగుటచేత శిష్యురాలి మాటనుబట్టి దొరతనము వారిపాఠశాలకు పిల్లలకుపిల్లలను బంపువారందఱును బదేసిసువర్ణము లపరాధము చెల్లింప వలయుననియు, చెల్లించువఱకును గ్రామము లోనివారెవ్వరును వారియిండ్లకు శుభకార్యములకు పోఁగూడదనియు, వెంటనే సభాపత్నులపేర శ్రీముఖములను బంపిరి.అయినను సభాపత్నుల బాలికలు సహుతము కొందఱు రాజభాషను చదువుకొనుచున్నవారగుటవలన వారా శ్రీముఖములనంతగా నాదరించిన వారుకారు. ఇంతకును రంఢీనగరములో నాజగద్గురువులవారి శిష్యకుటుంబము లన్నియు నూఱు మాత్రమేయున్నవి. అయినను తన్మతావలంబులు మాత్రమేమిక్కిలి చదువుకొన్నవారుగాను, ధనికులుగాను, చెల్లుబడికల వారుగానువున్నారు. ఈజగద్గురుపీఠ స్థాపకురాలయిన శ్రీశ్రీశ్రీ ఆది జంఢాముంఢార్ండా దేవిగారు పూర్వకాలము నందెప్పుడో పదునాఱు మతముల నుద్ధరించినంకున తత్పీఠమునకువచ్చిన వారికందఱికిని షోఢశ మతోద్ధారిణీబిరుదము పారంపర్యముగా వచ్చుచున్నది. అందు చేతనే యీపీఠమువారు జగద్గురువులమని యుతక్కిన సర్వమతముల వారును తమకుశిష్యప్రాయులేయని యుచెప్పు కొందురు. ఆమతముల పేరులనన్నిటిని దెలుపుట వలన నాకు వృధాయాసమేకాని దానివలన మీకేమియు లాభముగలుగదు. ఇటువంటి బిరుదము లాదేవివారికి మూఁడువేలమున్నూటముప్పది మూఁడుగలవు. ఆదేవిగారు షోడశమతముల నుద్ధరించినను, వాలిలోనెల్లను జంఢామతమును సర్వోత్తమమయినదని స్థాపించినారు. ఆమతసిద్ధాంతములించుమిణ్చుగా మనదేశమునందలి శాక్తేయ మత సిద్ధాంతములను బోలియున్నవి. భేదమంతయు మనలోనున్నస్త్రీనిదీసివేసి వారు దానిస్థానమునఁ