పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డనియ్యగూడదు. మనదెశమునందు పెట్టెలుచేయువారు పురుషులగుట చేత తాళము చెవులవిషయమయి యీదేశములో స్త్రీలు జరుపుదురను మోసపు పనులు మనదేశములో నుండవు. అంతేకాక యీపెట్టికానిర్మాణమువలన స్త్రీలకు మానరక్షణము కలుగుటయే కాక కమ్మరులకును వడ్రంగులకును క్రొత్తజీవనాధారము కలిగి దేశము భాగ్యసంపన్న మగును. కాబట్తి సాహితోపదేశమును మీరశ్రద్ధ చేయబోకుడు. నా దేశాటనమువలన గదా భరతఖండమున కీమహోపకారము కలుగుచున్నది ! దేశాటనము బహులాభప్రదమని పెద్దలన్నమాట వ్యర్ధ మగునా ?

పురుషులకు నలువది సంవత్సరములు దాటగానే రాజవాస బంధవిమోచనమగును. ఈనిర్బంధము వితంతుపురుషులకు సహితముండదు. అందుచేత పురుషులు స్వేచ్ఛగానుందుటకయి పత్నులకు విష ప్రయోగములుచేసియుందురుగాని, వితంతువులుకాగానే ముక్కుకో యుదురన్న భయముచేత నట్టిపనికి సాహసిమ పక వారు పత్నీభక్తికలవారయి యుందురు.

ఆఱవ ప్రకరణము

నాయజమానురాలైన ఫాంఢీభంగీగారు విద్వాంసురాలైన భాంగీఫింఢీగారిని నియమించి నా కింట విద్యచెప్పించుటయు, రంఢీ భాషలో నేను తగినంత పాండిత్యమును సంపాదించినతరువాత దొరతనమువారు క్రొత్తగాస్ధాపించిన పురుష పాఠశాలకు నన్ను పంపుటయు అక్కడ సహపాఠియగు మఱియొక పురుషునితో నాకు మైత్రికలుగుటయు మీకీవరకే తెలిపియున్నాను గదా ? మేమిరువురును తప్ప మఱియెవ్వరును పురుషు లాపాఠశాలలో చేర లేదు. మాకుపాధ్యాయుడుగా నియమింపబడిన జాతిపురుషుని పేరు చామర్జీ . అతడు