పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్థించినందునను నాలుగు దినము లయినతరువాత యాధాప్రకారముగా వచ్చి నాకామె మరల విద్యచెప్పనారంభించినది. ఆ దినము మొదలుకొని యిఁక నేనామెతో మన దేశమును గూర్చి మాటాడకూడదని యొట్టుపెట్టుకొంటిని. అటు తరువాత జరిగిన వృత్తాంతమును మీకు ముందు ప్రకరణములయందుఁ జెప్పెదను.

ఐదవ ప్రకరణము

వెనుకఁజెప్పినట్లు మాకలహముతీఱి మేమిద్దఱమును సమాధానపడిన తరువాత మా ఫిండీగారికి నా మీఁద అపరమితానుగ్రహము వచ్చినది. ఆయనుగ్రహము వచ్చుటకు కారణము నేనామెకు పరమభక్తుఁడనయి మనదేశములో శిష్యులు గురువులకు శుశ్రూష చేయునట్లుగా సమస్తోపచారములను చేయుచు అనువర్తనముకలిగి మెలఁగుటయేకాని మఱియొకటికాదు. స్త్రీలయినను పురషులయినను విద్యచెప్పినవారు దైవసమానులు గనుక నేను స్త్రీకి దాస్యము చేయుచుంటినని మీరు నన్ను నిందింపక నాగురుభక్తికి మెచ్చుకొనవలెను. అదిపోనిండు. అటు తరవాత శిష్యవత్సలురాలైన యామె యాదేశజనుల యాచార వ్యవహారములు మొదలయిన వన్నియు నాకు మర్మము విడిచి చెప్ప మొదలు పెట్టెను. ఆమె యొకఁనాడు భోజనము చేసి కూరుచుండి యుత్సాహముతో తాంబూలచర్వణము చేయుచు కూరుచున్నప్పుడు నేనుపోయి గరువందనము చేసి చేతులు జోడించుకొని యెదుట నిలుచుండి భక్తిపూర్వకముగా నిట్లదిగితిని.

అమ్మా! మీరూ సర్వమును తెలిసినవారు. స్వభాముచేత పురుషులే యెక్కవ బలముగలవారో స్త్రీలే యెక్కువ బలముగలవారో మీ శిష్యునకు సెలవియ్యవలెను.