పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశమెఱిఁగిన యనుభవజ్ఞడగుట చేతను దేశభాష తెలిసినవాఁడగుట చేతను బహుప్రయాణములు చేసినవాఁడగుటచేతను భద్రముగా నుండునని నా మూట కూడ నాతని సంచిలోనే యుంచితిని. నాటి మధ్యాహ్నము మూఁడు గంటల వేళ బండి కూడలూరు వద్ద పది నిముషముల సేపు నిలువుగా మేమక్కడ లఘుశంకకు పోవ దిగితిమి. ఈలోపుగా మేమెక్కిన బండిలో మా సరనను మఱియెవ్వరో క్రొత్త వారు వచ్చి కూరుచుండిరి. మేము మరల వచ్చి కూరుచున్న రెండు నిమిషములకు బండి కదిలినది. అప్పడు మా బ్రాహ్మణుడు వారితో అరవములో ప్రసంగింప నారంభించెను. వారెవ్వరని నేను తెలుగులో నడుగఁగా వారు మాలవాండ్రనియు, పొగబండ్లలో ప్రయాణములు చేయువా రాచారవ్యవహారములను పాటింప రాదనియు, మా బ్రాహ్మణుడు నాకు హితభోధ చేసెను .ఈ ప్రయణము మూలమున మాలకూడు వచ్చినదని నాలో నేను విసుఁగుకొని, రాత్రి ఆఱు గంటలకు మాయవరము వద్ద బండి యేడు నిమిషములు నిలువగా దిగి, నేను మరియొక బండిలోనికి పోయి కూరుచుంటిని. ఏడు గంటల పావుకు బండి మరల కుంభకోణము వద్ద ఇరువదియైదు నిమిషములు నిలిచినప్పడు మా బ్రాహ్మణుడు బండి దిగి నా వద్ద కేదో ఫలాహారమును తెచ్చెనుగాని నేనా మాలగుడ్డలతో నేమియు తిననందున నా వంతు వచ్చినది కూడ నతఁడేతిని బండిలోనికి పోయెను. ఆ రాత్రి మేమిద్దరమును మరలకలిసికోలేదు. స్ధల మిఱుకుగా నున్నందున పడుకొన చోటు చాలక నాకు తిన్నగా నిద్రపట్టినది కాదు. నాఁటి తెల్లవారుజామున అయిదు గంటల పావుకు మేమిద్దరమును బాహ్యమునకు పోవుటకయి మధురవద్ద దిగినాము. అతఁడేవేళకును మరల రాలేదు. పావుగంట సేపటికి మరల బండికదులుటకు సిద్ధముకాగా, అతఁడేబండిలోనో యెక్కియుండునని తొందరలో నేనొకబండిలో నెక్కితిని. ఆదినము పదునొక్క గంటవేళ