పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సారులు హిరణ్యదానములు చేసితిని; ఎన్నిసారులో యిప్పుడు సరిగా జ్ఞప్తికిరాలేదుగాని పెక్కుసారులు వస్త్రదానములు చేసితిని; పిల్లకుపాలు కావలసివచ్చినందున రెండుసారులు సవత్సక గోదానములు సహితమాయనకే చేసినాఁడను. చేసిన దానములు చెప్పుకోరాదు. ఇటువంటి గుప్తదానములు మఱియెన్నెన్నో నేను చేసితిని. ఈ హేతువు చేత దానములు చేయఁగా మిగిలిన సొమ్ము నాకును నా భార్యకును నిత్యైకాదశీవ్రతములతో భుక్తికయినను చాలకుండెను. ఇట్లుండగా నా భార్య జ్వరబాధితురాలై, మా గ్రామములో రెండవ ధనవంతరియని ప్రసిద్ధికెక్కిన వైద్యశిఖామణి చేత ఇరువది యొక్క లంకణములు కట్టించఁబడి ఆకస్మికముగా స్వర్గస్థురాలయ్యెను. ఆ చిన్నదాని చావుతో నాకీ లోకము మీద విరక్తికలిగినది. ఈ సమయములోనే ఋణప్రదాతలు కఠినులై నన్ను తమ యప్పులకై చెఱసాలకు సహితము పంప యత్నించుచుండిరి. ఈయన్ని కారణముల చేతను నాకు సంసారము మహారణ్యమువలె తోచఁగా నాకప్పడు సర్వసంగములును పరిత్యజించి ముముక్షుఁడనై యెగిని కావలెనన్న బుద్ధిపుట్టినది. అందుచేత నేను నా తల్లిని మా మేనమమగారి ఇంటికి పంపివేసి, ముందుగా అప్పలవారి బాధను తప్పించుకొనుటకై దేశత్యాగము చేసి దక్షిణ దేశయాత్రలు సేవింపలెనన్న యుద్దేశముతో విశాఖపట్టణము వచ్చి చేరితిని. అప్పడాపట్టణములోనున్న నా బాల్యమిత్రుడొకడు నన్ను చూచి నా దురవస్ధివిని జాలిపడి నాకు నూరు రూపాయలిచ్చిను. మఱునాటి యుదయకాలమున నేను సముద్రతీరమునకు పోఁగా ధూమనౌక యొకటి యప్పడే రేవునకు వచ్చెను. అదియెక్కడకు పోవునని విచారింపఁగా చెన్నపురికి పోవునని యక్కడివారొకరు చెప్పినందున శీఘ్రముగా పోవలెనన్న యభిలాష చేతను, దుస్సహమైన ఋణప్రదాతల బాధ తప్పించుకోవలెనన్న యుద్దేశము చేతను, సముద్రయానము శాస్త్రనిషిద్ధమని తెలిసినవాఁడ