పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పుచున్నది. అందుచేత పితృనియోగమును మాతృనియోగమును నాకుసమానముగానే యలంఘ్యములయినవి. నేనిపప్పుడు తండ్రియభిష్టమును తీర్చవలెను. తల్లిమనోరధమును తీర్చవలెను. కాఁబట్టి నేను బుద్ధిమంతుఁడనయినందున పితృవాక్య పరిపాలనను మాతృవాక్యపరిపాలనమును కూడచేసి యుభయ ఋణవిముక్తుఁడనయి కృతార్థతను పొందుటకొక్క యుపాయము నాలోచించితిని. ఆయుపాయమును విన్న పక్షమున నాబుద్ధికుశలతకు మీరును సంతోషింపకపోరు. తల్లి యజ్ఞానుసారముగా నేనింగ్లీషు పాఠశాలకు పోవుచుంటిని; పోవుచున్నను పాఠములను చదువక తండ్రిగారి యిష్టానుసారముగా పోనట్లేయుంటిని. ఈ యుపాయము చేత నే నుభయవాక్య పరిపాలన దక్షుఁడనై ధన్యుఁడనుకాఁగలిగితిని. ఈ ప్రకారముగా నేను దాదాపుగా పది సంవత్సరములు హూణపాఠశాలలో చదివినను, గొప్ప పరిక్షలో దేనిలోను కృతార్థుఁడను కాలేదు. కాని యెంతో కష్టము మీఁద నేను సామాన్య పరీక్షలో మాత్రము తేరినాఁడను. నేనింటికడ పాఠములు చదువకపోయినను, ఉపాధ్యాయుల కృషి చేత నా ప్రయత్నములేకయే కొన్ని యింగ్లీషు ముక్కలు నాకుక్షిలోదూరినవి. అటు తరువాత వానిని నా హృదయము నుండి పాఱఁదోలుట నాకు సాధ్యమయినది కాదు. ఎవ్వానికయినను మొదట చోటిచ్చిన తరువాత వెడలఁగొట్టుట సులభసాధ్యముకా నేర్చునా? అయినను నా చేతనయిన పని నేను మన వేదశాస్త్రములకు విరుద్ధముగా మాయసాధ్యాయులు బోధించిన భూగోళ విషయములను చరిత్రములను హూణశాస్త్రములను సత్యములని నమ్మకుంటిని. ఈ చరిత్రమును చదివినకొలఁదిని నా మాటలయందలి సత్యము మీకే బోధపడఁగలదు. ఇంగ్లీషు చదువు వలన బుద్ధిహీనులైన యిప్పటిబాలురకువలె నాకు మన శాస్త్రములయందును పురాణములయందును నమ్మక మావగింజంతయు తగ్గినది కాదు. ఇంగ్లీషు తిన్నగా చదువుకున్నను నేను నిత్యమును