Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరంపరలు నేవింపఁగా ఆచార్య పదమునొంది పూజింపబఁడెడు భాగ్యము పట్టినదికాదు. మా తల్లి పుట్టినింటివారు మొదటి నుండియు లౌక్యవ్యనహారములలో పుట్టిపెరిగినవారగుట చేత మా మేనమామగారగు కంచి శేషగిరి రావు పంతులు గారు నన్ను వేద పాఠశాలకు పంపక బడి చదువుకాఁగానే హూణ పాఠశాలకుఁ బంపిరి. మా గ్రామములో నొక బ్రాహ్మణ బాలుఁ డింగ్లీషు చదివి క్రైస్తవ మతములో కలిసినప్పుడు మా తండ్రిగారు నన్ను మాత్రమే గాక మా వంశమున పుట్టినవారి నెవ్వరిని కూడ హూణ పాఠశాలకు పంపమని ప్రతిఙ్ఞ పట్టిరి. నాకు బుద్దివచ్చు వఱకును జీవించియుండిన పక్షమున వారు తమ ప్రతిజ్ఞను తప్పక చెల్లించుకొనియుందురు. తానొకటితలఁచిన దైవమొకటి తలఁచునుగదా? నేను చిన్నవాఁడనయినను పూర్వచార విరుద్ధమయిన మాలచదువు చదువుట నాకిష్టము లేకపోయెను. దానికీతోడు మా తండ్రిగారిప్పుడు జీవించియున్న పక్షమున వారు నన్ను హూణపాఠశాలకు పంపుట కిష్టపడి యుండరుగదాయన్న విచారమొకటి నా మనస్సును భాధింపఁజొచ్చెను. ఈ రెండు కారణముల చేతను నాకింగ్లీషు చదువెప్పుడును సరిపడినది కాదు. అయినను నాకప్పుడింకొక బాధ కూడ తటస్థమయ్యెను. నా మేనమామ మాటవిని నా తల్లి ప్రతి దినమును హూణపాఠశాలకు పొమ్మని నన్ను నిర్భంధింప మొదలు పెట్టినది. అప్పుడు నాకు పరస్పర విరుద్ధములయిన రెండు ధర్మములు సంప్రాప్తములయినవి. నేనింగ్లీషు పాఠశాలకు పోవుట నా తండ్రిగారి యభిమతముగాదు; పోకుండుట తల్లిగారి యభిమతము కాదు. ఇందులో నేనెవ్వరి యభిమతమును చెల్లింపను? నా మనస్సు తండ్రిగారి యాజ్ఞనే చెల్లింప వలసినదని భోధించుచున్నను చచ్చి స్వర్గమునందున్న తండ్రిగారి యాజ్ఞనువలె బ్రతికి భూలోకమునందున్న తల్లిగారి యాజ్ఞను మీఱుట నాకుసాధ్యముగా కనఁబడలేదు. మన వేదము పితృదేవోభవయని మాత్రమేకాక మాతృదేవోభవయని కూడ