Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశ యాత్రలు.


ప్రథమ భాగము

ఆడుమళయాళము

మొదటి ప్రకరణము


నేను పరీధావి సంవత్సర చైత్ర శుద్ధ నవమి మంగళవారమునాఁడు పుష్యమీ నక్షత్రమందు విజయనగరములో పూర్వము శ్రీ రాములవారు పుట్టిన దినముననే జన్మించితిని. మాయింటి పేరు పత్రివారు. నేను వ్యాసరాయాచార్యులవారి పుత్రుఁడను. నా తల్లి లక్ష్మీబాయమ్మ. నేను ముందు మహాసత్యసంధుఁడనయి యీ సత్యచరిత్రమును వ్రాయుదునని తెలిసియో, తనకుఁగల సత్యప్రియత్వము చేతనో, మఱి యేహేతువు చేతనో మా తండ్రిగారు నాకు తన తండ్రి పేరు పెట్టక దేశాచారమును తప్పించి చిన్నతనములోనే నాకు సత్యరాజాచార్యులని పేరు పెట్టిరి. మా తండ్రిగారు జ్యోతిశ్శాస్త్రమునందు మహా పండితులయినందున పుణ్యపురుషాగ్రగణ్యులయిన వారు స్వమహీమ చేత నా భవిష్యద్యోగతను ముందుగా తెలిసికొనియే తప్పక నాకిట్లు నామకరణము చేసియుందురు. "సుకృతీగతాయుః" అను న్యాయమనుబట్టి వారు నాపసితనములోనే పుణ్యలోకయాత్రకు విజయం చేసినందున నా పేరును గూర్చి వారి నడిగి తెలిసికొనుట కవకాశము లేకపోయినది. నా నిజమయిన పేరు సత్యరాజాచార్యు లయినను మా గ్రామములోనున్న వారు నన్ను సత్యరాయాచార్యులని పిలుచుచుండిరి. 'రాజు'ను 'రాయ'లని వ్యవహరించుట కర్ణాటక సంప్రదాయము. అంతేకాక, 'జ'