Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఆలాగున నవశ్యము చేయవలసినదే' యను ధ్వనులతో నిండిపోయెను. మాటలాడువారు ధనవంతులైనచో, వ్యర్థవచనము సహితము స్తుతియోగ్యము కాకపోదు సుండీ. ఆ మాటల వలన నుత్సాహము కలిగి, రాజశేఖరుడుగారా బైరాగిని తాము జూడకపోయినను బ్రహ్మవర్చస్సు కలవాడని శ్లాఘించిరి.

అంత సిద్ధాంతి యుల్లములో లేని సంతోషమును మోమున దెచ్చిపెట్టుకొని యొక్క చిఱునవ్వు నవ్వి, వినయము తోడ చేతులు జోడించి రాజశేఖరుడుగారి ముఖమున దృష్టి నిలిపి, "తమ మాట చేతనే మా చిన్నదాని బాధ నివారణమయినది. దాని యదృష్టము బాగుండబట్టియే దేవరివారి ముఖము నుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే తమ సెలవు ప్రకారము బైరాగి యొద్దకు వెళ్లెదను." అని మనవి చేసి, ప్రయాణోన్ముఖుడయి లేచి నిలువబడెను. రాజశేఖరుడు గారి యభిప్రాయము కొంచెము తెలిసినతోడనే బైరాగి మహానుభావుడనువారును మహామంత్రవేత్త యనువారును, వాయుభక్షణము చేయుననువారును, మండువేసవిని పంచాగ్నిమధ్యమున దపస్సు చేయుననువారును అయి సభ యంతయు అతని విషయమైన స్తుతిపాఠములలో మునిగిపోయెను. ఒక్క గొప్పవాడొకనిని మంచివాడన్నచో, ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని నోరు స్తుతివాక్యముల కొరకు తడవుకొనును?

అప్పుడు రాజశేఖరుడు గారు వీధి వంక జూచి: "ఎవ్వరో స్త్రీలు నీళ్లకు వచ్చి మనలజూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలుచుండి యొండొరుల మొగముల వంక జూచుకొనుచున్నారు. మనమందఱమును లేచి బైరాగిని జూచి వత్తము రండి." అను మాట తోడనే ఎల్లరును లేచి ప్రయాణోన్ముఖులయి నిలుచుండిరి. వెంటనే యందఱును గలిసి యుత్తరముఖముగా రామపాదముల వైపునకు నడవనారంభించిరి.