పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

బావమఱఁది లోపలతలుపు వేసుకొని కూరుచుండుచు వచ్చెననియు, అట్లు రెండుమూడుదినములు జరిగినపిమ్మట దామోదరయ్య లోపల తలుపు వేసుకొని కూరుచుండి యేమో పాతాళహోమము చేయుచున్నాఁడని గ్రామములో నొకవదంతి కలిగినదనియు, ఆవల గ్రామములోని వారందరును నాలోచించి యందరకును కీడుకలుగుటకై మేదోమహామంత్రమును పునశ్చరణ చేయుచున్నాఁడు కాని వేరుకాదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగించినఁగాని తమకు బ్రతుకు లేదని గోదవరియొడ్డున సభ చేసినా రనియు, ఆ రాత్రియే యిల్లు కాలుట మొదలుగాఁగలవని యంతయు జరిగిన దనియు, అతఁడు చెప్పెను. నేనును పదిదినములకర్మయు జరిగినదాఁక వారియింటనే యుండి, పదమూఁడవనాఁడు బయలుదేరరాదు గనుక పదునాలగవనాడు కాసుల పేరుతో మీరున్న గ్రామమునకు రావలెనని వచ్చుచుండగా, త్రోవలో సిద్ధాంతి యగపడి రహస్యమని నన్ను దూరముగా దీసుకొనిపోయి మానగలపెట్టెను నారాయణమూర్తి తమయింటి దాఁచుట చెప్పి తనకు నూఱురూపాయలిచ్చెడు పక్షమున పెట్టె నాతనికియ్యక నిలిపి యుంచెద ననియు, మీమామగారిని చూచి వచ్చినతోడనే తగవు పెట్టవలసిన దనియుఁజెప్పెను. నేనును మంచిదని చెప్పి మీకొఱకు వెదకుకొనుచు వచ్చితిని. అని శంకరయ్య తనతండ్రి సంగతి యంతయు ఁజెప్పి మూటను విప్పి కాసులపేరును దీసి రాజశేఖరుఁడుగారిచేతి కిచెను. ఆయన దానిని పుచ్చుకొని మేనల్లుని కౌఁగిలించుకొని యూరార్చుచు, దామోదరయ్య పోయినందుకు గొంతతడువు విచారించెను. అప్పుడింటనున్నా వారందరును దామోదరయ్య నిమిత్త మొకసారి రోదనముచేసి భోజనములు చేసిరి. ఆ మధ్యాహ్నమంతయు లోకవార్తలతో ప్రొద్దు జరిగినది.