పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పదమూడవ ప్రకరణము

చుండఁగా నిరుగుపొరుగులవారు వచ్చి నన్నోదార్చి, నాలుగుదినముల క్రింద రాత్రి యాకస్మికముగా గృహమునకు నిప్పంటుకొని సాయము వచ్చులోపలనె కాలిపోయినదని చెప్పిరి. నేనంతట నారాయణమూర్తి గారియింటికిఁబోయితిని. అతఁడావఱకే మాతండ్రికి దహనసంస్కారములు చెయించెను. మీరా గ్రామమునుండి వచ్చినప్పటి నుండియు మానాయనయు నారాయణమూర్తిగారును ప్రాణస్నేహము కలవారుగా నుండిరి. మీరు ధవళేశ్వరము విడిచిపెట్టిన నెలదినములకు నారాయణమూర్తిగారి లోపల దొంగలుపడి యొకరాత్రి సర్వస్వము దోఁచుకొనిపోయిరి. అందుచే నతఁడు మరల బీదవాఁడై మాతండ్రి ననుసరింపఁగా భూతవైద్యములో తనకు సహాయునిగా నాతనిని త్రిప్పుచు భోజనమున కేమయిన నిచ్చుచుండెను. మా నాయనకు గ్రామములో నందరును శత్రువులుగా నేర్పడి నప్పుడు,నారాయణమూర్తిగా రొక్కరే పరమమిత్రుడుగా నున్నాడు. మీబావమఱఁదికి గ్రామములోనివారు తనసొత్తును దోచుకొని పోవుదురని భయము తోచినప్పుడు, ఒకనాఁటిరాత్రి రహస్యముగా నన్ను తోడుపట్టు మని నగలును రొక్కము నున్న పెట్టెను నారాయణమూర్తిగారి యింటికిఁ గొనిపోయి అతని పడకగదిలో బెట్టి లక్కతో ముద్రవేసి పైని కప్పతాళమువేసి తాళపుచేవిని తనదగ్గరనే యుంచుకొనెను. నారాయణమూర్తి నన్నుఁజూచి మానాయనను తలఁచుకొని యేడ్చునప్పుడు, 'నా యొద్ద దాఁచుకొన్న నగలపెట్టెనుగూడ మరణ కాలమునకుఁ దీసుకొనిపోతివా ' యని యేడ్చేను. నేను పడకగదిలోనికి వెళ్ళినప్పుడు పెట్టెయచ్చటలేదు; ఆ యింటమరియొకచోటను గనఁబడలేదు. తరువాత మాతండ్రి చావును గురించి యడుగఁగా, నేను హేలాపురమునకు వెళ్ళినది మొదలుకొని వీధిలోనికి వచ్చిన నెవ్వరేమిచేసెదరోయను భీతిచేత మీ