పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయించుచున్నాను. అంతతో నూరకుండక కామావధానులు గారినే "పంచముఖి వీరహనుమంతము" పునశ్చరణ చేయవలసినదనియు, జవశాంతి కేమయిన గావలసియున్న ఏ రాజశేఖరుడు గారినైన కాళ్లో కడుపో పట్టుకొని తెచ్చి నాలుగు రూపాయల సొమ్మిచ్చుకొనైన నిచ్చుకొనియెద మంచి విభూతి పెట్టమనియు ఆయన ననుసరించి బతిమాలుచున్నాను. అందుచేతనే యీ నాలుగు దినముల నుండి దర్శనము చేయలేదు గాని లేకపోయిన నేది యెట్లయినను నేను తమ దర్శనము మానుదునా?"

రాజశేఖరుడు "శాస్త్రి గారూ! మీరు రూపాయల నిమిత్తము సంశయపడనక్కరలేదు. కావలసియున్న ఆ నాలుగు రూపాయలను నేనిచ్చెదను. మరి నాలుగు రూపాయలు పోయినను మంచి వైద్యుని విచారింపవలెను. మన గ్రామములో కామావధానులు గారి కన్న ..." అని మిన్ను వరకు జూచి యేమో యాలోచించుచుండెను. సిద్ధాంతిగారు చేసిన స్తుతి యమోఘముగా బట్టుకొని కొంచెముగానో గొప్పగానో ధనరూపమైన ప్రతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నది గాని యీ వఱకెన్నడును రాజశేఖరుడుగారి వద్ద వ్యర్థముగా బోలేదు.

ధవళేశ్వరమునందును చుట్టుపట్టుల గ్రామములందును వేఱు సిద్ధాంతి లేడు గనుక, ఆయన యింటికి వచ్చి వర్జ్యమెప్పుడని గాని, ప్రయాణమునకు ముహూర్తము పెట్టుమని గాని, క్రొత్త బట్ట చించి కట్టుకొనుటకే దినము మంచిదని గాని, ఇల్లు కట్టుకొన నారంభించుటకే మాసమనుకూలమైనదని గాని, క్షౌరము చేయించుకొనుటకే వారము మంచిదని గాని, వివాహమునకు లగ్నము పెట్టుమని కానీ, రజస్వల యయినప్పుడు నక్షత్రము చెప్పుమని గాని, సదా యెవ్వరో యొకరాయన నడిగి పోవుచునే యుందురు. దూరబంధువులు పోయి