Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్ణులు మాగ్రామమునకు విజయం చేసినారుగాని మరియొకటి కాదు." అని రామశాస్త్రి గారి వంక దిరిగి, "మనము వారి ముఖము ముందఱ స్తుతి చేయవలసినది కాదు గాని రాజశేఖరుడు గారు కేవలము నీశ్వరాంశ సంభూతులు సుండీ.".

ఆ మాటల కాదరము సూచించెడి మందహాసము చేసి రామశాస్త్రి "అందుకు సందేహమేమి? ఈ సంగతి మీరు నాతో జెప్పవలెనా? వారీ గ్రామమున నుండబట్టి మనమందఱము వారి యండను నిలువగలిగినాము గాని, లేని యెడల నిండ్లును వాకిళ్లును విడిచిపెట్టి మనమీపాటికి దేశముల పాలయి లేచిపోవలసినవారము కామా? వారి తండ్రిగారిక్కడకు వచ్చినప్పటినుండి యిది యొక గ్రామముగా గనబడుచున్నది గాని యింతకు బూర్వము దీనికి నామరూపములున్నవా?"

అని, మంచి సమయము తటస్థించినప్పుడు తన పాండిత్యమును దాచిపెట్టక, అందుకొని సిద్ధాంతిగారి స్తోత్రపాఠములకు సాయముగా దనవి కూడా నాలుగు కలిపెను.

అప్పుడు రాజశేఖరుడు గారు మనసులో మిక్కిలి సంతోషించినను పయికా సంతోషము కానరాకుండా నడచికొని "సిద్ధాంతి గారూ! మొన్న మీ రెండవ చిన్నదానికేమో గ్రహబాధ కనబడ్డట్టు విన్నాను. కొంచెము నిమ్మళముగానున్నదా?"

యని యడిగినతోడనే సిద్ధాంతిగారు మోమున దీనభావము గానిపింప గొంచెమాలోచించి తలయూచి "జోశ్యుల కామావధానులగారి చేత విభూతి పెట్టించుచున్నాను. కానీ దాని వల్ల నిప్పటికేమియు గుణమే కనబడదు. జాతకరీతిచే దానికిప్పుడు శని చాలదు. ఎందుకైనను మంచిదని నా తమ్ముని చేత నవగ్రహ జపము