మును దర్శింపవచ్చు. ప్రవక్తల స్తోత్రములకు మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్ఛాయ యెఱ్ఱనిది; విగ్రహము కొంచెము స్థూలముగాను పొట్టిగాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు పండితుడని నోపజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరుకావి దోవతి; సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టబడి కొంగు కొంత వ్రేలాడ వేయబడియున్నది; చెవులనున్న రవలయంటు జోడును, కర్మిష్టుడనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామిక నందలి బంగారపు దర్భముడి యుంగరమును, తర్జనియందలి వెండి బటువులు రెండును తప్ప శరీరమున నాభరణములేవియు లేవు; ఆయన పేరు రాజశేఖరుడు; ఆయన ముఖప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి, ఆయన వారివారి తారతమ్యముల కర్హముగా దగిన మర్యాదలు చేసి కూర్చుండుడని చేయి చూప, 'చిత్తము' 'చిత్తము' 'మీరు దయ చేయండి' అనుచు జావడి నిండ గిటగిటలాడుచు గూరుచుండిరి.
అప్పుడు రాజశేఖరుడు గారు "సిద్ధాంతి గారూ! మీరు నాలుగు దినముల నుండి బొత్తిగా దర్శనమిచ్చుట మానివేసినారు! మీ యింట బిన్నపెద్ద లందఱును మరేమియు లేకుండా సుఖముగా నున్నారు గదా?"
సిద్ధాంతి - "చిత్తము, చిత్తము. తమ అనుగ్రహము వల్ల మేమందఱము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన నన్నవస్త్రాదులిచ్చి కాపాడగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండగా మావంటి వారికేమి కొదువ? మా గ్రామము చేసికొన్న భాగ్యము చేతను, మా పురాకృత పుణ్యము చేతను, తమ వంటి దాన