Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దూర్పు ప్రక్కను "ధర్మచావిడి" అని యొకటి యుండెను. అది పరదేశ బ్రాహ్మణులును, మార్గస్థులును రాత్రులు పరుండుటకై మొట్టమొదట కట్టబడినది కాని, ఆ కాలమందది యుబుసు పోవుటకై గ్రామములోని పెద్దమనుష్యులు ప్రతిదినమును ఉదయాస్తమయము లందు ప్రోగై యిష్టకథాగోష్టిం గొంత ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగపడుచుండెను.

ఒకానొకదినమున సూర్యుడుదయించి ప్రాచీముఖంబున గుంకుమబొట్టు నందంబు వహించి వృక్షాగ్రములను బంగారునీరు పూసినట్టు ప్రకాశింప జేయుచుండెను; చెట్ల మీది గూళ్ల నుండి కలకల ధ్వనులతో వెలువడి పక్షులు నానాముఖముల ఎర కయి వెడలుచుండెను; పసులకాపరిబాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక "వెల్లావు కడి నాది" "దోర గేదె కడి నాది" యని గంపలు చేతబట్టుకొని, పడుచు లొండొరుల మీరి పరుగులిడుచుండిరి. కాపులు ములుకోలలు బుజముల మీద బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలములకుం బోవుచుండిరి; అప్పుడు కాయశరీరము గల యొక పెద్దమనుష్యుడు జందెము పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలో గాళ్లును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును సవ్యముగా వేసికొని వచ్చి, ధర్మశాల మీద వొడ్డున గూర్చుండి, వచ్చునప్పుడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మపుడకతో దంతధావనము చేసికొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరములుండును; మొగము మీద స్ఫోటకపు మచ్చలే లేకపోయెనేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కఱయుండదు; అట్టని, యా ముఖమాయనకు నిత్య