పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూచి దుఃఖముతో నలుప్రక్కలను రుక్మిణిని వెదకికొనుచు దిరిగి యెందు నేమియుఁగానక మరల నెప్పటి చోటునకు వచ్చి, అచ్చటఁ గొంత సేపు పచ్చిక బయలును గూరుచుండి యాపచ్చికను తనకన్నీటితో దడిసి రుక్మిణి దేహము నేమృగములో యీడ్చుకొనిపోయి యుండునని నిశ్చియము చేసుకొని యీదుర్వార్తను గొనిపోయి యొట్లు భార్యతోను బిడ్డలతోను జెప్పుదునా యని కొంతసేపు దుఃఖించి మెల్లఁగా లేచి కాళ్లు తడఁబడ నడచుచు త్రోవ పొడుగునను రుక్మిణి యొక్క సౌందర్యమును సుగుణసంపదలను దలఁచు కొని కన్నుల నీరు నించుచు మధ్యాహ్నాము రెండు జాముల కేలాగుననో యింటికి దేహమునుచేర్చి నడవలో చాపమీఁద చతికిలఁబడి యేమో చెప్పఁబోయి మాటరాక పెదవులు నాలుకతో తడుపుకొనుచ నూరుకుండిరి. అప్పుడు మణిక్యాంబ తొందరపడి లోపలికి పరుగెత్తుకొనిపోయి కంచుచెంబుతో మంచితీర్థము తెచ్చి నోటి కందిచ్చి పయిటచెఱఁగుతో మొగముమీఁది జెమ్మటతడిచి విసనకఱ్ఱతో విసరుచు మగని మార్గాయాసమును కొంతవఱకు పోఁగొట్టెను. అంత నతఁడును కొంత ధైర్యమును నవలంవించి , కన్ను కొలుకులనుండి నీరు కాలువలు కట్టి గడియకొకమాట చొప్పున దుఃఖమును మింగు కొనుచు రుక్మిణి వార్తను జెప్పెను .అప్పుడందఱును పెద్దబెట్టున గొల్లుమని రోదనము చేయునారంభించిరి. అది విని సత్రపు బ్రాహ్మణుఁడును చుట్టుపట్ల వారు వచ్చి , వారికి యాపదను దెలిసుకొని నహు విధముల వారి నూరార్చి భోజనమునకు లేవఁదీసిరి . వారును విస్తళ్ళయొద్ద కూరు చుండి తినఁబోయిన మెతుకులు లోపలికి పోన కొంత సేపు కూరుచుండి విచారముతో విస్తళ్ళను వదిలి పెట్టి లేచిరి. అప్పుడు నూతి పెరటిలోనికిఁ బోయి వారు చేతులు కడుగుకొనుచుండగా కేకలు