పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

రామ- మున్నెప్పుడు మీరు దూరదేశ ప్రయాణములను చేసినవారుకారు. నామాటవిని మీరీవేసవికాలము వెళ్ళువఱకైన భీమవరములో నుండుఁడు. అది గొప్ప పుణ్యక్ష్యేత్రము; భీమనది సమీపమున భీమేశ్వరస్వామివారి యాలయమున్నది.; దానికిని పెద్దాపురమునకును క్రోసెడుదూరముకలదు. పెద్దాపురమును పాలించుచున్న కృష్ణగజపతిమహారాజుగారు మిక్కిలి ధర్మాత్ములు; వారు తమ ప్రజలక్షేమమును విచారించు నిమిత్తమయి మాఱువేషమువేసికొని తిరుగుచుందురు; వారియొద్ద మాభంధువొకఁడు గొప్ప పనిలోనున్నాడు. మీరుభీమవరములో మీకొక యుద్యోగమును జెప్పించెదను.

రాజశేఖరుఁడుగారు మంచివారుగనుక పెద్దాపురము వెళ్ళిన మీఁదట నాలోచించెదమని యప్పటికి చెప్పిరిగాని, యారాజుస్థితినిజూచి యాతఁడుద్యోగము జెప్పించు నన్నశనుమాత్రము పెట్టుకొన్నవారుకారు. ఈ మాటలు ముగియునప్పటికి వారు గ్రామమును సమీపించిరి.

రాజ- ఆ చెట్లకు గ్రామ మెంతదూరము?

రామ- గ్రామసమీపమునకు వచ్చినాము. ఆచెట్లు చెఱువు గట్టుమీఁదివి.చెఱువున కెదురుగానే సత్రమున్నది.

రాజ- మీరీపూటమాతో భోజనము చేసెదరా?

రామ- నాకు గ్రామములో బంధువులున్నారు; అక్కడకు వళ్ళి భోజనముచేసి, చల్లపాటువేళ మెల్లఁగా బయలుదేరి వచ్చెదను.మీరుస్త్రీలతో బయలుదేఱినారు. కాఁబట్టి భోజనముచేసినతోడనే ప్రయాణమయి ప్రొద్దుకుంకకముందే వేఁడిమంగలమును దాఁటవలెను.