పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

రాజ- కాశీయాత్రకయి బయలుదేఱినాము.

రామ- ఈ వేసవికాలము ప్రయాణమున కెంతమాత్రమును మంచిసమయముకాదు. ఈ యెండలో మీరు గాడుపుకొట్టి పడిపోవుదురు. త్రోవపొడుగునను దొంగలభయము విశేషము. మీకు రాజమహేంద్రవరములో నెవరైన బంధువులున్నారా? లేక మీకదే నివాసస్థలమా?

రాజ- గోటేటి రామమూర్తిగారిని మీరెఱుగుదురా? అతఁడు నాపినతండ్రి కొమారుఁడు. వారియింటనేనేను పదియేను దినములుండి బయలుదేఱినాను. మాస్వస్థలము ధవళేస్వరము.

రామ-మీపేరేమి? వీరందఱును మీ కేమగుదురు?

రాజ- నా పేరు రాజశేఖరుఁడు; వాఁడు నాకొమారుఁడు; ఆయాడుపిల్ల లిద్దఱును నాకొమార్తెలు; అది నాభార్య.

రామ- మీరింత వేసవికాలములో యాత్రకు బయలుదేరుటకు కారణమేమి? మీవైఖరిచూడ మిక్కిలి సుఖము ననుభవించిన వారుగాఁగనబడుచున్నారు.

రాజ- నేను మొదట ధనికుఁడనే యౌదును. కాని నా వద్దనున్న ధనమునంతను నాకొర్తెవివాహములోనిచ్చిన సంభావనలక్రిందను ముఖస్తుతులనుచేయు మోసగాండ్రకుఁజేసినదానముల క్రిందను వెచ్చపెట్టి బీదవాఁడనయి,కడపటి యాత్రకు బయలుదేఱినాను. నిత్యమును వారి స్తుతిపాఠములను స్వీకరించి నేను తుష్టిపొందుచుంటిని; నాధనమును స్వీకరించి వారు తృప్తిమొందుచుండిరి. తుదకొక బైరాగి బంగారము చేసదనని నాయొద్దనున్న వెండిబంగారముల నపహరించి వానికి బదులుగా నింత బూడిద నిచ్చి పోయి నన్ను నిజమైన జోగిగా జేసెను.