పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

పై కొమ్మజేరి కూర్చుంటిని; పులియు విడిచిపోవక వృక్షముక్రిందనే పీటపెట్టుకొని గూరుచుండెను; నేఁడు తెల్లవారినతరువాత పదిగడియల ప్రొద్దెక్కువఱకును అది యాప్రకారముగానే యుండి చివరకు విసిగి లేచిపోయినది; నేను నిన్నటి యుదయమునుండియు నిద్రాహారములు లేక వృక్షశాఖయందేయుండి, పులిపోయిన గడియకు మెల్లగా వృక్షముదిగి కత్తిని చేతఁబుచ్చుకొని బయలుదేఱి గతదినమంతయు నెంతచేత మలమల మాడినందున నాలిక పిడచకట్టి నడచుటకు కాళ్ళయందు సత్తువలేకయేరీతినో దేహము నీవృక్షచాయకుఁ జేరవైచిపడిపోయితిని. నాకు చేతిమీఁద మాత్రమివుగో రెండు గాయములైనవి. అనిచెప్పి చేయి చూపిపైకి చేతికఱ్రలాగున నగపడుచున్న మొఱయందున్న కత్తినిదీసిచూపెను. రాజశేఖరుఁడు గారును దానిని పుచ్చుకొని చూచి యాతఁడుచేసిన సాహసకార్యమునకు మిక్కిలి యాశ్చర్యపడసాగిరి.

రామ- నాకు మీరీదినమునపోయిన ప్రాణములను మరల నిచ్చినారు; మీకు నా ప్రాణములిచ్చినను, మీరుచేసినయుపకారము యొక్క ఋణముతీఱదు. నాయందు దయచేసి నేను కృతజ్ఞతా సూచకముగాఁ జేయు నమస్కారముల నంగీకరింపుఁడు. అదృష్టదేవత యితరులను ధనదనము మొదలయిన కార్యములచేతఁ దమకృతజ్ఞతను దెలుపునట్టుగాఁ జేసి యిప్పుడు బీదవాఁడనైయున్న నన్ను మాత్రము మీయింతటి మహోపకారికి వట్టిమాటలచేతనే నాకృతజ్ఞతను దెలుపునట్టు చేసినందున కెంతయుఁ జింతిల్లుచున్నాఁడను. అయినను నాచేతినైన యుపకారము మీకేదైన గావలసియున్నచో నా ప్రాణములకైన నాశపడక చేయ సిద్ధముగానున్నాఁడను. మీరిప్పుడెక్కడకుఁ బోయదరు?