పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

రాజశేఖర చరిత్రము

త్రోవచేసికొని ముందుకునడచి గుంపునడుమను చెట్టునీడను కటికి నేలను పరుండి చేతితో నోరునుజూపి నీళ్ళనిమిత్తము సైగచేయుచున్న యొకమనుష్యునిఁ జూచిరి. ఆమూఁకలో నొకఁడు నీళ్ళముంతను జేతిలోఁ బట్టుకొని 'ఈరాజు నిష్కారణముగా జచ్చిపోవుచున్నాఁడు; ఏదోషమువచ్చిననుసరే నీళ్ళుపోసి బ్రతికించెద'నని చేరువుకుఁ బోవుచుండెను. అప్పు డొక్కముసలివాఁ డడ్డమువచ్చి వానిచేయిపట్టుకొని నిలిపి, ' ఈవరకు బూర్వజన్మములో మన మెన్నియో పాపములను జేయుటచేతనే మనకిప్పుడీ శూద్రజన్మము వచ్చినది. ఇప్పుడీరాజును జాతిభ్రష్టునిజేసి యీపాపముసహితము కట్టుకోవలెనా? నామాట విని నీళ్ళు పోయవలద' ని వారించుచుండెను. ఇంతలో రాజు కన్నులు తేలగిలవైచి, చేయి నోటివద్ద కెత్తఁబోయి వడకించుచు క్రిందఁ బడవైచెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు వెంటనేపోయి మంచినీళ్ళతో ముందుగా నెండుకొనిపోవుచున్న పెదవులను దడిపి నోటిలోఁ గొంచెమునీళ్ళు పోయఁగా గొంతసేపటికి కాతఁడు మెల్లగాఁ చప్పరింపనారంభించెను. అంతట రాజశేఖరుఁడుగారు తనచేతిలోని యుదకముతో మొగమును దడిపి మఱికొంచెమునీరు లోపలికిఁ బోయఁగా త్రాగి కన్నులు విప్పిచూచి రెండవప్రక్క కొత్తిగిలి మఱి కొంతసేపునకు సేదతేఱి, ఆరాజు తనజీవములను నిలిపినందులకై రాజశేఖరుఁడుగారికి కృతజ్ఞతతో బహునమస్కారములు చేసి లేచి కూరుచుండెను. ఇంతలో పల్లెకుఁబోయినవారు మజ్జిగయు, కొన్ని పండ్లను దీసికొనివచ్చి యిచ్చిరి. ఆరాజు కొన్నిపండ్లను లోపలికిఁ బుచ్చుకొని మజ్జిగత్రాగి స్వస్థపడెను. అంతట నక్కడనున్నవారందఱును తమతమత్రోవలను బోయిరి. ఈలోపల మాణిక్యాంబ మొదలగువారొకతరువునీడను గూర్చుండి మార్గాయాసము కొంత