పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

సంవత్సరాది - రాజశేఖరుఁడుగారి ప్రయాణము - రాజానగరమునకు సమీపమున నొకరాజు వడఁగొట్టి పడిపోవుట - నల్లచెఱువు సమీపమున నొకయోగి కనఁబడుట - దొంగలు కొట్టుట - రుక్మిణి మరణము

సంవత్సరాదినాఁడు తెల్లవారినతరువాత రామమూర్తిగారు మంగలివానిని పిలిపించి రాజశేఖరుఁడుగారికిని సుబ్రహ్మణ్యమునకును వానిచేత తల యంటించిరి. ఇంటనున్న మగవారియభ్యంజనస్నానము లయినతరువాత, ఆఁడువారందఱును తలలంటుకొని నీళ్ళుబోసికొనిరి. స్నానములయినపిమ్మట వేపపువ్వును క్రొత్తమామిడికాయ ముక్కలును క్రొత్తచింతపండుపులుసుతో నందఱును దేశాచారముననుసరించి భక్షించి రెండుజాములకు పిండివంటలతో భోజనములు కావించి పండుగచేసికొనిరి. పండుగదినములలో జనులు మఱింత యెక్కువసుఖపడవలసినదానికి మాఱుగా, ఈదేశములో వేళతప్పించి భోజనములుచేసి యట్టిదినములందు దేహములను మఱింత యాయాస పెట్టుకొందురు. మధ్యాహ్నముచల్లపడినమీఁదట రామమూర్తిగారు రాజశేఖరుఁడుగారిని వెంటఁబెట్టుకొని నూతనపంచాంగశ్రవణమునకయి వేణుగోపాలస్వామివారి యాలయమునకు వెళ్ళిరి. ఆ వఱకే యొకసిద్ధాంతి పసపుతోఁగలిపినయక్షతలను పళ్ళెముతో ముందుపెట్టుకొని --

             శ్లో|| శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం|
                  గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం
                  ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాప సంపత్ప్రదం
                  నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం||