పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోవుటకు హేతు వుండదనియు, రాజశేఖరుఁడుగారు బహుదూరము వాదించిరి. అక్కడ నున్న పండితులలో నెవ్వరికిని యుక్తులుతోఁచక పోయినను, విశేషముగా కేకలుమాత్రము వేసిరి. అక్కడ నున్నవారికా వాదమేమియుఁ దెలియలేదు. కనుక బిగ్గఱగా నఱచినందున శాస్త్రులపేళ్ళవారే గట్టివా రని మెచ్చుకొని రాజశేఖరుఁడుగారి వాదము బౌద్ధవాద మని దూషించిరి. ఒకరిని వెక్కిరించుటవలనఁ గలుగవలసిన సంతోషము తప్ప మఱియొకవిధమైన సంతోషము తమకు లేదుగనుక, విద్యాగంధ మెఱుఁగని మూర్ఖశిరోమణులు రాజశేఖరుఁడుగారిని బహువిధములఁ బరిహసించి పొందఁదగిన యానందమునంతను సంపూర్ణముగా ననుభవించిరి. ఇంతలో గ్రహణమోక్షకాలము సమీపించినందున నెల్లవారును విడుపుస్నానమునకై పోయిరి. శుద్ధమోక్ష మయినతరువాత ముందుగా స్నానము చేసివచ్చి యాఁడువారు వంట చేసినందున దీపములు పెట్టించి యెల్లవారును ప్రథమభోజనములను జేసిరి.