పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిలుచుండి సంకల్పమును జెప్పుచు మూఢులయొద్దను స్త్రీలయొద్దను జేరి నీరుకాసులను గ్రహించుచుండిరి. పూర్వాచారమును బట్టి రాజశేఖరుఁడుగారు తామును స్నానము చేసిరిగాని , పయిని చెప్పిన కృత్యమును జేయువా రందఱును మూఢులని యెంచి గ్రహణవిషయమయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారంభించిరి. అతఁడు జ్యోతిషశాస్త్రమును నమ్మినను పురాణములనుమాత్రము శాస్త్రవిరుద్దముగా నున్నప్పుడు నమ్మకుండెను. కాఁబట్టి - శ్లో|| పశ్చాద్భాగా జ్జలదవదధ స్సంస్థితో భేత్యచంద్రో || భానోర్భింబం స్ఫురదసితయా ఛాదయత్యాత్మమూర్త్యా || అను సిద్దాంతశిరోమణీ శ్లోకమును, శ్లో||ఛాదకో భాస్కరస్యేందు రథస్థో ఘనవద్భవేత్! భూఛ్ఛాయాంప్రాఙ్ముఖశ్చంద్రో విశత్యస్య భవేదసౌ - అను సూర్యసిద్ధాంతశ్లోకమును జదివి, భూగోళమున కుపరిభాగమున సూర్యుడుండునపుడు చంద్రుడు తన గతివిశేషముచేత సూర్యునకును భూమికిని నడుమ సమకళయందు వచ్చునేని సూర్యగ్రహణము కలుగునుగాని రాహువు మ్రింగుటచేత గలుగదనియు పౌరాణికులు చెప్పినదే గ్రహణమునకు గారణ మయినయెడల రాహుకేతువుల మనసులలోని యభిప్రాయములను దెలిసికొనుటకు మనము శక్తులము కాముకాబట్టి గ్రహణ మిప్పుడుకలుగు నని ముందుగా దెలిసికోలేక పోయి యుందుమనియు, సూర్యగ్రహణ మమావాస్యనాడును చంద్రగ్రహణము పూర్ణిమనాడునుమాత్రమే పట్టుటకు గారణ ముండదనియు, రాహుకేతువు లాకాశమున నెప్పుడును గనబడకపోవుట యెలరు నెఱుంగుదుగాన సూర్యచంద్రులను మ్రింగగలిగినంత పెద్దవియే యయి యుండినయెడల గ్రహణసమయమున నవేల కనబడకుండుననియు, రాహువే మ్రింగునేని మన పంచాంగరీతిగా నీగ్రహణ మొకదేశమున గనబడి మరియొకదేశమున గనబడక