పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూర్తిగారు బలవంతపెట్టినందున నాతనిమాట తీసివేయలేక యొప్పుకొనిరి. పాల్గుణబహుళ అమావాశ్యనాఁడు పగలు మూడుజాములవేళ సంపూర్ణ సూర్యగ్రహణము పట్టెను. జనులందరును గోదావరిలో పట్టుస్నానము చేసి తమ పితరులకు తర్పణము లిచ్చుచుండిరి; కొందరు పుణ్యముకొఱకు నవగ్రహజపములు చేయుచు బ్రాహ్మణులకు నవధాన్యములును దానము చేయుచుండిరి; కొందఱు ఛాందసులును వృద్ధాంగనలును సూర్యునకు విపత్తువచ్చె నని కన్నుల నీరుపెట్టుకొనసాగిరి; వారిలో దెలిసినవార మనుకొనువారు సూర్యునకుఁ బట్టిన పీడను వదలఁగొట్టుట కయి మంత్రములను జపించుచుండిరి; వారి కంటెను దెలివిగలవారు గ్రహణకాలమునందు తమ కడుపులలో జీర్ణముకాని పదార్థము లుండిన దోషమనియెరిఁగి దానిముందు మూడుజాముల నుండియు నుపవాసములు చేయుచుండిరి; ఎల్లవారును భోజనపదార్థము లుండు పాత్రములో దర్భగడ్డిని వేయుచుండిరి; కదుపుతో నున్న స్త్రీలు పైకి వచ్చినయెడల అంగహీను లయిన పిల్లలు పుట్టుదు రని యెంచి పెద్దవా రట్టిస్త్రీలను గదులలోఁ బెట్టి తాళము వేసి కదలమెదలవల దని యాజ్ఞాపించిరి; మఱికొందఱు మంత్రవేత్తల మని పేరు పెట్టుకొన్నవారి కేమయిన నిచ్చి మంత్రోపదేశమును బొంది శీఘ్రముగా సిద్ధించుట కయి ఱొమ్ములబంటి నీటిలో జపము చేయుచుండిరి. గ్రహణకాలమున నోషధులయందు విశేషగుణ ముండునని యెంచి కొందఱుమూఢులు స్నానము చేసి దిసమొలలతో జుట్టు విరియఁబోసికొని చెట్లకు ధూపదీపములు సమర్పించి వేళ్ళను దీయుచుండిరి; గ్రహణ సమయమున దానము చేసిన మహాపుణ్యము కలుగు నని చెప్పి బ్రాహ్మణబ్రువులు తమ బట్టలు తడియకుండఁ బయి కెగఁగట్టుకొని మోకాలిలోతు నీళ్ళలో