పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండుయామములకు రాజశేఖరుఁడుగారి పినతండ్రికుమారుఁడగు రామమూర్తిగారియిల్లు చేరిరి. అప్పుడందఱును మంచినిద్రలో నుండిరి; కాఁబట్టి బండిచప్పుడు కాఁగానే తలుపు తీయఁగలిగినవారుకారు. కొంతసేపు తలుపువద్ద బొబ్బలుపెట్టినమీఁదట చావడిలోఁబరున్నవారెవ్వరో లేచివచ్చి తలుపుతీసిరి. రాజశేఖరుఁడుగారి మాట వినఁబడినతోడనే లోపలిగదిలోఁ బరుండియున్న రామమూర్తిగారు లేచివచ్చి, అన్నగారిని కౌఁగలించుకొని వారావఱకే వత్తురని కనిపెట్టుకొనియుండి జాముప్రొద్దుపోయిన మీఁదటనుగూడ రానందున, ఆదినము బయలుదేఱలేదని నిశ్చయించుకొని భోజనములుచేసి తామింతకుమునుపే పడుకొన్నా మని చెప్పి యంతయాలస్యముగా వచ్చుటకుఁ గారణ మేమని యడిగిరి. తాము చెప్పనక్కఱలేకయే తమబట్టలును మోఁకాలివఱకును బురదలో దిగఁబడినకాళ్ళును జెప్పసిద్ధముగానున్న దానినిమాత్ర మాలస్యకారణముగాఁ జెప్పి బండిని దామీడ్చుకొనివచ్చినసంగతినిమాత్రము చెప్పక రాజశేఖరుఁడుగారు దాచిరి. అప్పుడీయవలసిన బండికూలి నిచ్చివేసి బండివానిని పొమ్మనిచెప్పఁగా వాఁడు తాను విశేషముగా శ్రమపడితి ననియు తనబండియెడ్లంతటి మంచివి మఱెక్కడను దొరకవనియుఁ జెప్పి తన్నును తనయెడ్లను గొంతసేపు శ్లాఘించుకొని బహుమతిరావలెనని యడిగిన తడవుగ మాటాడనిచ్చినయెడల మాటవెంబడిని బండిని తాములాగుకొనివచ్చిన మాటను చెప్పునేమోయను భయమున సామానుదిగినతోడనే బహుమతినిసహిత మిచ్చి రాజశేఖరుఁడుగారు వెంటనే వానిని బంపివేసిరి. క్రొత్తగా మగఁడు పోయినవారిని పుణ్యస్త్రీలు భోజనము లయిన తరువాత మొదటిసారి చూడరాదు గనుకను, ఆరాత్రి మంచిదినము కాదుగనుక, సువాసినుల నందఱను గదిలోనికిఁ బోయి