పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనఁబడుచుండెను; ఇంతలోఁ జీఁకటియుఁ బడెను. కొంతసేపటికి రాజశేఖరుఁడుగారు క్రిందఁ జూచునప్పటికి బండికదలుచున్న జాడకనఁబడలేదు. అప్పుడు కుంభకర్ణునివలె నిద్రపోవుచున్న యాబండి వానిని లేపఁబూనుకోగా, కేకలేమియుఁ బనిచేసినవుకావు కాని వాని కాలిమీఁద కొట్టినదెబ్బలుమాత్రము వానిని కదలి యొక్క మూలుగు మూలిగి మఱియొక్క ప్రక్కఁ బరుండునట్లుచేసినవి. మహాప్రయత్నముమీఁద వానిని లేపి క్రిందదిగి చూచువఱకు బండి త్రోవతప్పివచ్చి యొకపొలములో మోఁకాలిలోతు బురదలో దిగఁబడియుండెను. అప్పుడందఱును దిగి యావఛ్ఛక్తి నుపయోగించి రెండుగడియలకు బండిని రొంపిలోనుండి లేవనెత్తి మార్గమునకు లాగుకొనివచ్చిరి. కాని యెడ్లుమాత్రము తాము బండిని గొనిపోవుస్థితిలో లేక తమ్మే మఱియొకరు గొనిపోవలసిన యవస్థయందుండెను. కాఁబట్టి చీఁకటిపడువఱకు బండి శ్రమచేసి వారినిలాగుకొని వచ్చినందునకుఁ బ్రత్యుపకారముగా నిప్పుడు చీఁకటిపడ్డందున వారే బండి నీడ్చుకొనిపోవలసిన వంతువచ్చెను. ఇట్టియవస్థ పగలు సంభవింపక రాత్రి సంభవించినందున కెల్లవారును మిక్కిలి సంతోషించిరి. అందఱిబట్టలకును బురదచేతఁ జిన్నవియుఁ బెద్దవియు నైనపలువిధము లైనపుష్పము లద్దఁబడినవి; బండిలో నెక్కివచ్చినవారి కెట్లున్నను చూచువారు లేకపోయిరికాని యున్నయెడల వారికెంతయైనవినోదము కలిగియుండును. బండివాడు భీమునివంటివాఁడు గనుక రాజశేఖరుఁడుగారి సహాయ్యముచేత బండిని సులభముగా నీడ్చుచుండగా, సుబ్రహ్మణ్యము వెనుకజేరి యెడ్లను స్త్రీలను నడిపించుకొని వచ్చెను. వారు నడిచియే వెళ్ళినయెడల జాములోపలనె రాజమహేంద్రవరము వెళ్ళిచేరియుందురు గాని బండినికూడ నీడ్చుకొని పోవలసివచ్చినందున రాత్రి