పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని బదు లడిగి యేమాత్ర మయిన సుబ్బమ్మమాసికమున కయితెం డని ప్రార్థించిరి. ఆయన వారిమాటను దీసివేయలేక దామోదరయ్యను, నారాయణమూర్తిని, మిత్రులవలె నటించి తన వలన లాభమును పొందిన మఱికొందఱిిని బదు లడిగి చూచెనుగాని, అక్కఱలేనప్పుడు వెనుక మేము బదులిచ్చెదము మేము బదులిచ్చెదమని యడుగనిదే పలుమాఱు సంతోషపూర్వకముగాఁ జెప్పుచు వచ్చినవారు, ఇప్పుడు నిజముగాఁ గావలసి వచ్చినది గనుక పోయియడిగినను వేయిక్షమార్పణలు జెప్పి విచారముతో లే దనిరి. పలువురు రాజశేఖరుఁడుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, గొంతకాలమువఱకును గొందఱు వచ్చుచుండిరి. కాని తమ్మేమయిన ఋణ మడుగుదురేమో యని యిప్పు డావచ్చెడువారు కూడ రాకుండిరి. కాఁబట్టి మును పెప్పుడును మనుష్యులతో నిండియుండి రణగుణధ్వని గలిగియుండెడి రాజశేఖరుఁడుగారి గృహ మిప్పుడు త్రొక్కిచూచువారులేక నిశ్శబ్దముగా నుండెను. అయిన నాస్థితియందది చిరకాల ముండినదికాదు; దాని స్తంభముహూర్తబలమెట్టిదో కాని తరువాత మరల సదా మనుష్యులతో నిండి మునుపటికంటెను సమ్మర్దము గలిగి బహుజనధ్వనులతో మాఱుమోయుచుండెను. మునుపు మనసులో నొకటి యుంచుకొని పయి కొకటి చెప్పుచుఁ గపటముగాఁ బ్రవర్తించువారితోను, బట్ట యిమ్మని కూడు పెట్టుమని యాచించు దరిద్రులతోను నిండి యుండెనుగాని యిప్పుడు మనసులో నున్నదానినే నిర్భయముగా మొగముమీఁద ననెడు ఋజువర్తనము గల వారితోను బట్టలును భోజనపదార్థములు గొన్నందున కయి యీవలసిన సొమ్మిమ్మని యధికారమును జూపు భాగ్యవంతులతోను నిండియుండ నారంభించెను. గృహమునకు మనుష్య సమృద్ధి కలిగినట్టుగానే రాజశేఖరుఁడుగారికి వస్తుసమృద్ధియు నానాఁటి