పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

191


గీ.

రాజగురుభక్తికిని భక్తరాజిపాల
శంకరుఁడు గోరిగంది వశంవదాత్ముఁ
డగుటను సర్వభూతంబు లౌర యనుచు
నద్భుతావేశ మొదవంగ నభినుతించె.

294


సీ.

అంతట నిఖలజ్ఞుఁ డగువిరూపాక్షుఁ డ
        త్యనుపమభక్తిసమగ్రుఁ డైన
క్షితిపతి గురుభక్తికిని జిత్తశుద్ధికి
        సూనృతపాలనస్ఫురణ కార్త
రక్షణశక్తికిఁ బ్రమదితస్వాంతుఁడై
        పలుకు నవ్విభు మహీపాలచంద్ర
వినుము నీయనవద్యవృత్తంబునకు మోద
        మందితిఁ బటుశక్తి నుర్వి నింకఁ


గీ.

కొన్ని సమములు పాలించి కూర్మి నెంచి
దిశల నిర్మలసత్కీర్తిఁ దెలివి నించి
నాదుసాలోక్యలక్ష్మి పొందంగఁగలవు
పొమ్ము మది సంశయము మాని పురమునకును.

295


వ.

అనునవసరంబున హర్దోత్కర్షంబున నద్భుతప్రాభవుండగు నుద్భటుం డనుకంపాసంపదభిరామస్వాంతుండై కృతవందనుండగు నమ్మహీకాంతు నహీనాశీర్వాదంబుల నాదరించె తక్కిన సురకిన్నరగరుడోరగాదులు నాదరంబున నతనిం బ్రశంసించిరి చిత్రరథుండును వసుంధరాకళత్రు నగ్గింపుచుఁ గుంభనిశుంభప్రభృతులగు ప్రమథులం గూడి నర్తించె, నంతకాంతకుండు నంతర్ధానంబు సేసె నిట్లు చరితార్థుఁడగు ముంజభోజుండు నిజనగరంబుఁ బ్రవేశించె నంత.

296