పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ఉద్భటారాధ్యచరిత్రము


క.

ఈ చందంబునఁ బొగడు మ
హీచక్రాధీశుమీఁద నీశ్వరుఁడు కృపా
గోచరకటాక్షపాత
ప్రాచుర్యం బొదవఁ బలుకు బలుమృదుఫణితిన్.

288


క.

మెచ్చితి నిను ముమ్మాటికి
నిచ్చెద వర మెద్దియైన నీ వడుగుము శ్రీ
మచ్చరిత యనుఁడు భూవరుఁ
డచ్చంద్రకిరీటుఁ బలుకఁ బ్రాంజలి యగుచున్.

289


చ.

కరుణ యొకింత చిత్తమునఁ గల్గినమేటివి నీవు పార్వతీ
శ్వర! తరుణేందుశేఖర! దివస్పతిముఖ్యనిలింపమౌళి ని
ర్జరతరుపుష్పనిర్గతపరాగవిరాజితపాదపద్మ! ఖే
చరవిభు నీతనిన్ మనుపు శాపము వాయ ననుగ్రహింపవే.

290


క.

నీయందు నుద్భవించిన
యాయుద్భటగురుని పూన్కి యీడేర్చుటకై
శ్రీయుతుఁ జేయు మితని వా
లాయమ్ముగఁ దరుణహరిణలాంఛనమకుటా!

291


మ.

అనుచున్ వేదశిఖావతంసమగు నయ్యదీంద్రజాజానిప
ద్వనజాతద్వితయంబుపై నృపుఁడు గంధర్వేశ్వరుం బెట్టి భో
రున దండాకృతి దోఁప శంభుఁడును గారుణ్యంబుతో లెమ్ము లె
మ్మని తత్ఖేచరుమాళిఁ జేర్చి వరదానాస్రస్తమున్ హస్తమున్.

292


ఉ.

ఆ నిఖలాధినాథుశుభహస్తము మస్తము మోచినంతఁ దే
జోనిధియై మణిమయవిశుద్ధసువర్ణకిరీటహారియై
మానితహారగుచ్ఛరుచిమండలమండితుఁడై వియచ్చరుం
డానినవేడ్కతోడఁ బ్రమథాకృతిఁ దాల్చె విచిత్రసంపదన్.

293