పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

ఉద్భటారాధ్యచరిత్రము


గీ.

గిన్నరులు పన్నగులు సిద్ధఖేచరులును
బోల విద్యాధరులు గూడి పొగడుపలుకు
లురుతరంబయ్యు దిక్కులు నొరసి మించి
చూచుజనులకు నానందశోభ చెంద.

276


వ.

ఇట్లు మంథానమహీధరమధ్యమానసుధాపయోధిధ్వానంబు విడంబింప నమ్మహీమహేంద్రుండు గంధర్వరక్షణార్థంబై ప్రాణబంధంబుతోడ నవంధ్యసంధాధురంధరత్వంబు సంబంధింపఁజేసి గురుచరణస్మరణపారీణుండై కరాళకరవాలంబుఁ గేలఁ గీలించి శశాంగశేఖరుం గుఱించి.

277


శా.

ఓకందర్పవిరోధి! యో పురహరా! యోహస్తిచర్మాంబరా!
యో కాంతాశ్రితదేహ! యోశశిధరా! యోపద్మగర్భార్చితా!
యోకద్రూసుతహార! యోహరిహరా! యో మేరుబాణాసనా!
ఆకర్ణింపుము నాదువిన్నపము దేవా! వామదేవా! శివా!

278


సీ.

కారణంబులు నీవ కార్యజాలము నీవ
       భావజ్ఞుఁడవు నీవ భావ మీవ
జనకుండవును నీవ జన్యవస్తువు నీవ
       ప్రావకుండవు నీవ ప్రాప్య మీవ
ఆధారమును నీవ యాధేయమును నీవ
       భోక్తవ్యమును నీవ భోక్త వీవ
రక్షకుండపు నీవ రక్షణీయము నీవ
       హార్యంబు నీవ సంహర్త వీవ


గీ.

పూజకుఁడ వీవ పూజ్యంపుఁబొడవు నీవ
వాచకుఁడ వీవ తలపోయ వాచ్య మీవ
జ్ఞానమును నీవ చూడంగ జ్ఞాని వీవ
నిటలలోచన! సకలంబు నీవ నీవ.

279