పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

169


క.

అలధరణీధరకరవర
నిలయ! మహైశ్వర్యధుర్య! నిటలాక్ష! విని
ర్మలదేహ! పార్వతీప్రియ!
నెలకొను మీ యాసనమున నెయ్యముతోడన్.

203


క.

గానప్రియ! విష్ణుకళ
త్రా! నిరుపమ! నిత్య! రాజరాజసఖ! హరా!
సూనాశుగహర! గైకొను
భానుశశాంకాగ్నినేత్ర! పాద్యము దీనిన్.

204


క.

మధుమథనదృగర్పితపద
విధిశీర్షసరోజభేదవిధిచణహస్తా!
విధుకాంతవర్ణ! శివ! జగ
దధినాథ! పరిగ్రహించు మర్ఘ్యము దీనిన్.

205


క.

అణిమాదిగుణాన్విత! భవ!
ఫణివల్లభహార! దివిజభర్తృనమస్యా!
గణనాథ! నీలలోహిత!
ప్రణుతాచమనీయకంబుఁ బాటింవు దయన్.

206


క.

తుహినగిరిదుహితృపాణి
గ్రహణప్రీతాత్మ! భూతగణవృతరాజీ
వహితశతకోటితేజో
మహిత! మదిం బొదలు విహితమజ్జనలబ్ధిన్.

207


క.

అజ్ఞానతిమిరభాస్కర!
విజ్ఞానవిలాసజనక! విశ్వేశ్వర! స
ర్వజ్ఞ! నిజభక్తవత్సల!
ప్రజ్ఞాధిక! కొమ్ము వస్త్రరాజము దీనిన్.

208