పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

చందవోజ్జ్వలశివాస్తనమండలముఁ బోలు
        వెలిగుబ్బమూపురం బలమువాని
వెండిగుబ్బలిచక్కి నుండియు నఖిలంబుఁ
        దానయై యున్న చందంబువానిఁ
బెనుబాము రెడ్డిగంబున మించి వలయాచ
        లావృతక్షితివోలె నమరువాని
భసితచర్చాసముల్లసితుఁడై చంద్రికా
        న్విరిహిమాచలమూర్తి హెచ్చువాని


గీ.

జడలఁ దుఱిమిన రేఱేనియొడల వడియు
నమృతసేకంబుచేతఁ బ్రాణములు వడయు
విధుశిరోమాలికలు చేయు వేదపాఠ
మునకు మోదించువేల్పుఁ గల్గొనియె నృపుఁడు.

113


ఉ.

ఆమునిమానసాంబుజవిహారమరాళు నగేంద్రకన్యకా
స్వామిఁ ద్రయీమయాత్ముఁ బురుషత్రయమూర్తి జగన్నివాసు నా
శాముఖిసంచరద్బహుళసాంద్రశరీరమహస్సమూహు ఫా
లామృతభానుమౌళిఁ గొనియాడె మహీరమణుండు మ్రొక్కుచున్.

114


క.

తనుఁ బ్రస్తుతించుభూవిభుఁ
గని కరుణారసము దొలుక గౌరీవిభుఁ డ
ల్లనఁ జేరఁ బిలిచి యిట్లని
యె నిబిడదశనాంశువులు ముఖేందునిఁ బొదువన్.

115


క.

ఇటు ర మ్మర్భక! నీ మది
ఘటియిల్లిన చింత విడువు కలిగెడు నీకున్
గుటిలభవబంధపాశ
త్రుటనసమర్థుండు సద్గురుఁడు వెఱవకుమీ!

116


క.

నాచేతఁ బనుపువడి శై
వాచార్యవతంసుఁ డుద్భటాహ్వయుఁ డిపు డీ
భూచక్రంబున నున్నాఁ
డాచతురాత్మకుఁడు నీకు నగు గురుఁ డధిపా.

117


క.

అనువృత్తాంతంబుం గలి
గినకలఁ గని మేలుకాంచి క్షితిపతి చిత్తం
బున నానందాద్భుతముల
కనుపట్టఁగ నుండె నంతఁ గడచనె నిశియున్.

118


శా.

ప్రాతర్వేళ సమర్హకృత్యములు నిర్వర్తించి ధాత్రీవిభుం
డాతారాధిపమౌళి రాత్రి కలయం దాయాయిచందంబులం
బ్రీతిం బల్కినపల్కు లార్యులకుఁ జేపన్ జెప్పినన్ వారలున్
జేతోవీధుల విస్మయిల్లి నృపునాశీర్వాదముల్ మున్నుఁగాన్.

119


చ.

పలుకుదు రిట్లు వింటివె నృపాలశిఖామణి! నిశ్చలంబుగాఁ
దెలిసినవాఁడ వీశు భవదీయమనోరథముల్ ఫలించుటల్
తలఁప విచిత్రమే గిరిసుతాహృదయేశుఁడు భక్తులైనవా
రల కరచేతిలోని సురరత్నము గొంగుపసిండి యారయన్.

120


క.

కలలోనఁ గంటిఁ జంద్రశ
కలభూషణు ననుట యొక్కకడిఁదియె నీకుం
గలశంభుభక్తి యేరికిఁ
గల దిప్పటికాలమున జగన్నుతచరితా!

121


వ.

ఈవు కృతపుణ్యుండ వీవు తలంచిన సంకల్పంబు నిర్వికల్పంబుగా ఫలియించు సంశయంబు వలవదని ధరాబృందారకులు భూపురందరుచేత సంభావితులై యథేచ్ఛంబుగా జని రంత ముంజభోజుండు దాఁగన్నసుస్వప్నంబునకు నచ్చెరువందుచు నిది నిక్కంబగునొకో యనుచు శంకరుండు నాపాలం గృపాలుం డగునొకో యనుచు ననేకప్రకారంబుల మనోరథపరంపరాపరతంత్రుండై యుండె నక్కాలంబున నొక్కనాఁడు ముక్కంటియానతిఁ దలమోచి.

122