పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ఉద్భటారాధ్యచరిత్రము


క.

అహికంకణుపాదాంభో
రుహములు గనువాఁడ సద్గురునికృపకతనన్
వహియింపంగ నోపని దు
స్సహసంస్కృతి యిదియు నొక్కసౌఖ్యము కొఱకే!

102


గీ.

అరసి యెంతటివారికి నందరాని
నీలలోహితపదమహానిధిఁ గనంగఁ
దత్త్వవిదుఁడైన దేశికోత్తంసుసదయ
మగు కటాక్షాంచలంబు దివ్యాంజనంబు.

103


గీ.

చేవ సంసారభవసుఖక్షితిజమునకు,
నావ కలుషాంబునిధి తారణంబునకును,
ద్రోవ దుర్లభతరము ముక్తిదుర్గమునకు
శ్రీమదారాధ్యపాదరాజీవసేవ.

104


ఉ.

కాయము శారదాంబుదనికాయమువోలెఁ దలంప నధ్రువం
బాయువు భిన్నకుంభగత మైనజలగతిన్ వసించు నీ
ప్రాయము సత్త నా దగగు పంచమ(?)వాసరభోగ్య మింక నా
కాయజవైరిఁ జేరుటయె కర్జము నాకు గురూక్తిపద్ధతిన్.

105


క.

ముక్కంటిమూర్తి యిదియని
నిక్కంబుగఁ దెలిపి చూపనేర్చుగురుఁడు నా
కెక్కడఁ గలిగెడి దైవమ!
అక్కట నాప్రార్థనంబు నాలింపఁగదే!

106


గీ.

అనువిచారంబుతోడ నన్యములు నెవ్వి
యును సమీక్షింప నొల్లక మనసులోన
దగినదేశికు నరయు నద్ధరణినాథుఁ
డొక్కరే యిట్లు కలగాంచె నక్కజముగ.

107