పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ఉద్భటారాధ్యచరిత్రము


శాస్త్రదృష్టికృతార్థచారులోచనములు
        సిరికిఁ బద్మంపుటోవరులొ యనఁగ
సాలమానమున నుత్తాలోజ్జ్వలంబైన
        రూపు పౌరుషములప్రో వనంగ


గీ.

క్షత్త్రధర్మంబు దాన సాక్షాత్కరించి
యుజ్జ్వలాకారసంపద నొందె ననఁగ
సర్వజనతావిలోచనపర్వ మయ్యె
రాకుమారుండు యౌవనారంభవేళ.

68


సీ.

లబ్ధవర్ణశ్రవోలంకారరేఖయై
        భాసిల్లు నాడినభాషణంబు
హరిణలాంఛనజూటచరణాంబుజములకు
        రోలంబపాకమై వ్రాలు మనుసు
హరిదంతకరిదంతపరిఘాతరములకు
        బలువెడితొడవులై వెలయుఁ గీర్తి
దర్పితాహితరాజదావానలమునకు
        ఘనవర్షధారయౌ ఖడ్గధార


గీ.

ప్రచురయాచకలోచనోత్పలములకును
విమలచంద్రాతపంబగు వితరణంబు
గండుమీఱుచు నారాజగంధకరటి
భాగ్యసౌభాగ్యవైభవోద్భాసి యగుట.

64


చ.

చదువక వేదశాస్త్రములు సమ్ముద మొప్పఁగఁ జేసె సామునం
గదియఁగ హెచ్చి వచ్చె నసికార్ముకచర్మముఖాస్త్రకౌశలం
బొదవె నొకప్పుడున్ దడవకుండినఁ గానకళావిలాసముం
గొదువ యొకింత లేక ఫణికుండలుపంవున రాజసూతికిన్.

65