పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ఉద్భటారాధ్యచరిత్రము


క.

అనియనుడు శివుఁడు నీమన
మునఁ గోరిక ఫలించు భూవర! కో నీ
వనితకు నిమ్మని కల్పక
జనితంబగుఫల మొకండు జనపతి కొసఁగెన్.

31


చ.

ఒసఁగినఁ దత్ఫలంబు మనుజోద్వహుఁ డాదరమొప్ప నంది వె
క్కసమగుభక్తి మ్రొక్కెఁ గఱకంఠునకున్ సతితోడ నంత న
య్యసమవిలోచనుండును సురాసురయక్షసమన్వితంబుగా
విసవిస నక్షిపద్ధతికి విందగుచందము మానె నయ్యెడన్.

32


మ.

హరదత్తంబగు కల్పవృక్షఫల మార్యస్తుత్య! విశ్వంభరే
శ్వరుకాంతామణి ప్రాణవల్లభు నిజాజ్ఞాసంగతిన్ నేమ మొ
ప్ప రుచిన్ లోఁగొనియెన్ సదాశివు మనఃపద్మంబునం జేర్చి శ్రీ
కరమై యొప్పుదినంబునన్ దనయకాంక్షాయుక్తి మత్తిల్లుచున్.

33


వ.

ఇట్లు సఫలమనోరథుండై యమ్మహారథుఁదు నిజనగరోన్ముఖుండై యొక్కనాఁడు.

34


సీ.

భక్తవత్సల! విశ్వభర్త! శంకర! నాదు
        కోర్కి యీడేర్పుమీ కొంకులేక
అన్నపూర్ణాదేవి! యంబ! సైకతనితం
        బిని! నన్ను రక్షించుమీ ప్రియమున
డుంఠివిఘ్నేశ! యుత్కంఠ నున్ముఖవృత్తి
        నొందుమీ ననుఁ బ్రోచునొరిమ గలిగి
యఖలలోకనమస్య! యాకాశగం ! ని
        ర్మలమూర్తి! యొసఁగుమీ మహిమ నాకు