పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఉద్భటారాధ్యచరిత్రము


గీ.

కనక మార్జింతు నెన్నిమార్గముల నైనఁ
గనక మార్జించుకొని కొందుఁ గనకలతను
గనకలతఁ గూడ నీమాఱు గలిగెనేని
వేయు నేటికి త్రిజగతీవిభుఁడఁ గానె.

237


శా.

ఆవింధ్యాచలపార్శ్వపట్టణము లత్యంతంబు నానాధన
శ్రీవాసంబుల నాఁగ విందుము జనశ్రేణుల్ ప్రశంసింప నే
నే వేగం జని తద్ధరాస్థలము పృథ్వీపాలకాగారముల్
ప్రావీణ్యంబునఁ గన్నపెట్టి సకలార్థవ్రాతముల్ దెచ్చెదన్.

238


క.

కడియును గత్తియు నాచే
వడి యుండినయేని పద్మభవునిల్లైనన్
పడిఁ జొచ్చి కన్నమున వెస
వెడలింపనె మినుకకుండ వేదండంబున్.

239


క.

అని కృతనిశ్చయుఁ డగుచు
జనియెన్ గహనంబు త్రోవ సాహసవృత్తిన్
మనమునఁ గొంగక దక్షిణ
మునకై ధనకాంక్ష దన్ను మునుకొని తివియన్.

240


చ.

నెనరగు నింతితోఁ బెరసి నీడమెఱుంగున నున్నవాఁడు గా
వున నడవంగలేక తనువుం గలచెయ్వులు దూలఁ జిక్కి విం
ధ్యనగసమీపకాననమునందుఁ బథిశ్రమ మోర్పు డింపఁ ద
త్కనకలతావిటుండు వెడగాడ్పు రవిప్రభఁ గూడి వీవఁగన్.

241


క.

వడదాఁకి దప్పిగొని యా
చెడుపాఱుఁడు పెదవు లెండఁ జెదరి పదంబుల్
వడవడ వడకఁగ వింధ్యపు
నడుతెరువునఁ బడియె నొక్కనగపతినీడన్.

242