పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ఉద్భటారాధ్యచరిత్రము


గీ.

అఖిలజగదేకమోహిని యగుచు[నావి
శాలమీనప్రతీకాశ]లోలనేత్రి
తనకు నర్ధాంగలక్ష్మిగా ధర్మమార్గ
మునఁ బ్రవర్తించు నమ్మహీభుజుఁడు ప్రీతి.

14


క.

ప్రాలేయకిరణముఖి యగు
బాలామణిఁ గూడి ప్రమథపాలాభుఁడు భూ
పాలా[గ్రగణ్యుఁ డాతఁ డ
నాలో]లమనస్కుఁ డయ్యె యౌవనవేళన్.

15


క.

గలిగి సురూపముఁ బ్రాయముఁ
గలిగియుఁ గలగంఠిపొందు గలిగియు లోనన్
గలుగంగనీఁడు దుర్మద
ముల హయ[శతశక్తి] నృపకులాగ్రణి యెందున్.

16


చ.

పరమపవిత్రయై తగుప్రభావతితోడుత నిష్టభోగముల్
బొరయుచు నేలనల్గడలు పూని నిజాజ్ఞకు లోనుజేయుచున్
హరుఁ దరుణేందుమౌళి భువనాధిపుఁ భక్తి భజించు నన్నరే
శ్వరునకుఁ గల్గదయ్యె సుతసంపద సంపదకెల్లఁ బ్రోదియై.

17


క.

సుతలాభమ్మునకుం దగ
క్షితిపతి చింతించి తనదు సీమంతినితోఁ
జతురత నిట్లను నొకనాఁ
డతులరహస్యైకగోష్ఠి ననుకూలుండై.

18


ఉ.

ఏలితి నేలనల్గడ లహీనబలంబున వైరివీరులన్
దోలితి భూమిభృద్గుహలు దూఱ మనోంబుజకర్ణికాస్థలిన్
గీలన చేసితిన్ వృషభకేతనుపాదము లింతి! యీశుభ
శ్రీలకుఁ దోడు నందనులచెన్ను గనుంగొనుఁ టెంతభాగ్యమో.

19