పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ఉద్భటాచార్యచరిత్రము


వ.

ఇవ్విధంబునఁ జిగురులకుం జిగియును, గ్రొన్ననలకుం జెన్నును, విరులకు మురిపెమ్మును, బిందెలకు నందమ్మును, గాయలకు సోయగంబును, దోరలకు గౌరవంబును, బండులకు మెండును గలిగించి పలాయితహేమంతంబుగ వసంతం బయ్యె నయ్యెడ.

88


ఉ.

చల్లనిగాడ్పులన్ సొబగు చల్లెడు వెన్నెలఁబువ్వుఁదావులన్
బల్లవవిభ్రమస్ఫురణఁ బ్రౌఢపికాళిశుకాలిపల్కులన్
బల్లిదుఁడైన యట్టిగణభర్త భవానియుఁ దాను వేడ్క వ
ర్ధిల్లఁగ నెల్లచోట విహరింపఁగ నొప్పె సఖీపరీతుఁడై.

89


సీ.

కలకంఠకులకుహూకారాంతరములైన
        మావిమోకలజాడ మరలి మరలి
సొలయునెత్తావులు చోడుముట్టెడు పువ్వుఁ
        బొదరిండ్లనెలవులఁ బొదలి పొదలి
అలిబాలికామనోహరఝంక్రియలఁ బొల్చు
        దీర్ఘికాతటములఁ దిరిగి తిరిగి
మకరందపంకిలమంజుమార్గంబుల
        నీడల నీడల కేఁగి యేఁగి


గీ.

చంద్రికాధౌతనిర్మలచంద్రకాంత
నిచితనవపుష్పశయ్యల నిలిచి నిలిచి
కలికిబాగునఁ బొదలలోఁ గలసి తిరిగి
రటుల దంపతు లా వనాభ్యంతరమున.

90


క.

విరులం బుప్పొడి రేఁపుచుఁ
దరఁగలు గదలించి కొలఁకు తండంబులలోఁ
దిరుగు మందసమీరణ
మరయుచు మురిపెమునఁ దిరిగె నభవునిమీఁదన్.

91