పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఉద్భటాచార్యచరిత్రము


క.

శివలింగదర్శనంబును
శివపూజావైభవంబు శివసద్గుణసం
శ్రవణంబును మానవులకు
భవనీరదపటలచటులపవమానంబుల్.

72


సీ.

ఏ వేల్పు పదముల కిందిరావల్లభు
        వలకన్ను పూజనావారిజాత?
మే వేల్పుకటిసీమ కిభదైత్యనాయకు
        బలితంపుఁ జర్మంబు పట్టుచేల?
మే వేల్పుతనువున కిక్షుబాణాసను
        గరువంపు నెమ్మేను కమ్మబూది?
యే వేల్పు కెంజాయ నేపారుజడలకు
        విధి కపాలశ్రేణి విరులదండ?


గీ.

యట్టి భువనాధినాథున కాదిదేవు
నకును మానసపుత్త్రుఁడై ప్రకటమహిమ
వెలయ నుద్భటగురుమూర్తి గలఁ డొకండు
సకలభవపాశలుంఠక చతురబుద్ధి.

73


గీ.

అతులదుర్మతకరటిపంచాననుండు
నిఖిలశైవాగమజ్ఞానసఖమనీషుఁ
డాశ్రితేప్సితదానదివ్యద్రుమంబు
నైన యుద్భటుచరిత నెయ్యమున వినుఁడు.

74


వ.

మహాత్ములారా! ఇది మీ యడిగినప్రశ్నంబునకు సదుత్తరంబై యుండు నీ చరిత్రంబు భవలతాలవిత్రంబు, నిశ్శ్రేయసక్షేత్రంబునునై వెలయునని యక్కథకుండు కథాకథనోన్ముఖుండై మహర్షుల కిట్లనియె.

75