పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18-6-1911లో ‘ప్రబంధమణిభూషణము’నకు మానవల్లిగారు వ్రాసిన పీఠికయందు ‘వనమాలివిలాసము’లోనివిగా 35 పద్యముల సంఖ్యావివరణ మిచ్చియుండిరి. ఇందు 17 పద్యములు ఆంధ్రసాహిత్యపరిషత్ప్రతి యందలి తృతీయ చతుర్థాశ్వాసములలోఁ గలవు. తక్కిన 18 పద్యములు పరిషత్ప్రతియందు లేవు. సందర్భము ననుసరించి ఈ పద్యములు మిత్రవిందకు స్వయంవరవేళ దాదిపట్టి పలువుర రాజులను చూపుచు వారిని వర్ణించి చెప్పునవిగనే యున్నవి. ‘ప్రబంధమణిభూషణము’నకును, పరిషత్ప్రతియగు ‘వనమాలివిలాసము’నకును మూలగ్రంథములు మానవల్లివారియొద్దనున్న ప్రతులే కదా! ‘వనమాలివిలాసము’లోనివిగా ప్రబంధమణిభూషణపీఠికయందు లేని 18 పద్యములు పరిషత్పండితులు మానవల్లివారియొద్దనుండి ‘వనమాలివిలాసము’ నెత్తి వ్రాసికొనునాటికి (1938) శిధిలమైపోయెనేమో! పరిషత్ప్రతియందలి చతుర్థాశ్వాసములోని కొన్నిపద్యములలో నెడనెడ కనపడు లుప్తభాగములు ‘ప్రబంధమణిభూషణము’లో సంపూర్ణములుగనే యున్నవి.

ప్ర.సంపా.

చ. మరుఁ డను నైంద్రజాలికుఁడు మానినినీలముఖస్తనద్వయీ
నిరుపమకోహళీయుగళి నించి జగజ్జనకందుకత్రయిం
బరిపరిరీతులన్ మొఱఁగి పల్మఱుఁ జూపు నిజైకవంచనా
పరతజగజ్జనంబులకుఁ బద్మవిలోచన యేమి చెప్పుదున్.

కోహళి – శివాలయములో శివలింగముపై నుంచెడి పంచముఖనాగాభరణము. ఇది క్రమముగా శిరోభూషణముగా నర్థము గాంచినది. శ్రీనాథుఁడు హరవిలాసమునం దీశబ్దము ప్రయోగించి యున్నాడు “మౌళింగోహళి సంఘటించిన క్రియన్”.ఇచ్చట యిది స్తనశిరోభూషణముగాఁ జెప్పఁబడినది. ఇందు కుచనీలముఖము కోహళిగా నిరూపితము. కోహళీశబ్దము సంస్కృతసమాసమధ్యగత మగుటచే దీనిని సంస్కృతశబ్దముగా భావింపవలెను. కోహళీ శబ్దమునుండియే కుళ్ళా(యి) వచ్చినది.

ఉ. ఆతఱి రాజమంచనివహాంచలవీథుల కేఁగుదెంచు న
బ్జాతదళాక్షిఁ బల్కె నటుచంద్రనిభానన దాదిపట్టి వి
జ్ఞాతసమస్తభూరమణజాతగుణాన్వయవేత్రదండమున్
జేఁత దెమల్చి మోఁపు జనసింధురవం బెడలించె వేడ్కతోన్.

శా. ఆ లంకాపురమేరుశైలతటపర్యంతావనీనాథు లా
శాలక్ష్మీశ్రవణావతంసితయశశ్ఛాయాగుళుచ్ఛుల్ మునుల్
ప్రాలేయద్యుతిభానువంశజులు లీలాపుష్పధన్వాకృతుల్
బాలా! నీ కయి కూడినా రిచట నో పద్మాక్షి! వీక్షింపవే.

సీ. కర్ణాటపతి వీఁడు కర్ణాయతేక్షణ
పాంచాలపతి వీఁడు పద్మవదన
కరహాటపతి వీఁడు గంధేభనిభయాన
ఘూర్జరపతి వీఁడు కోమలాంగి
కుంతలపతి వీఁడు కుటిలనీలాలక
సౌవీరపతి వీఁడు సరసిజాక్షి
సింధుభూపతి వీఁడు బంధుచింతామణి
కాంభోజపతి వీఁడు కంబుకంఠి

గీ. కోసలేశ్వరుం డాతఁడు కుసుమగంధి
వత్సపతి యీతఁ డాతఁ డవంతివిభుండు
సింహళుం డీతఁ డాతండు చేదివిభుఁడు
చూడు నరపాలకుల బాల! శుభగలీల.

సీ. మాళవనేపాలమత్స్యభూపాలురు వీరె
వీరలఁ జూడు విద్రుమోష్ఠి
కొంకణకురుభోటకుకురావనీశులు వారె
వారలఁ జూడు వనజగంధి
తెంకణద్రవిడవిదేహబర్బరపతుల్ వారె
వారె కను మంభోరుహాస్య
ఆభీరలాటబంగాళనాథులు వీరె
వెరవుతోఁ గనుగొను మెఱుఁగుఁబోడి

గీ. అంగవంగాంధ్రచోళపాండ్యత్రిగర్త
కాశికాశ్మీరయవనకేకయవరాట
విభులె యీయున్నవారలు వీరిలోన
నీకుఁ దగురాజు వరియింపు నీలవేణి.

క. సాయంతనసమయంబున
నో యింతీ! యితఁడు దిరుగు నువిదలుఁ దానున్
దోయధిరవనృత్యచ్ఛిఖి
గేయస్ఫాయత్సువేలగిరికూటములన్.

మ. శరణాయాతశరణ్యు నప్రతిరథున్ క్షత్రాన్వవాయైకవి
స్తరణున్ మాగధకల్పవృక్షు మగధక్ష్మాపున్ సితచ్ఛత్రచా
మరసింహాసనకేతనప్రధితసమ్యగ్రాజచిహ్నాఢ్యుఁ జూ
డు రమానందరూపుఁ గానమికి నొండుంజింత లే దీమెయిన్.

ఉ. వీఁడటె కాముఁ డేఁ జెఱకువిల్లెటు వోయె మహేంద్రుఁ డట్టె క
ట్టాఁడిమెఱుంగుఁగన్ను లెటుడాఁచె జయంతుఁడె ఱెప్పవాల్చు లే
పోఁడిమి నేర్చె నశ్వినియె పొత్తెటు వాయఁగఁబెట్టె నంచుఁ గ్రొ
వ్వాఁడిమెఱుంగుఁజూడ్కుల నివాళు లొనర్తురు వీని కచ్చరుల్.

క. రాజన్యమౌళి నీతని
నోజన్ వరియించి పౌరయువతీనయనాం
భోజసుఖ మొదవఁజేయుము
రాజగృహారామకల్పరత్నాంకురమై.

ఉ. దశకంఠక్షయధూమకేతు వగు నుద్యత్సేతు వేపారెనో
శశిబింబానన! దుష్టశిక్షణసరస్వద్రాజగాత్రంబులన్
విశదక్రోధవశాత్ముఁడై రఘుకులోర్వీనాథుఁ డాశానిరం
కుశతేజోధనుఁ డిడ్డశృంఖళిక నా క్షోణీధరస్ఫూర్తితోన్.

గీ. నవ్వుఁ దత్సేతుఖండంబు నలినవదన!
దాశరథి కబ్ధి చేసిన తప్పుఁ దలచి
సారెసారెకు వికచప్రసారసవిధ
తటసమాసక్తనూత్నముక్తామిషమున.

గీ. ఆ రసాతలపర్యంతమైన సేతు
మూల మాధారముగ వచ్చి ముదితభోగి
కామినీతతి చదువు మై గగురుపొడువ
నచట రఘువీరజయశాసనాక్షరములు.

ఉ. దానికిఁ గొంతదూరమునఁ దామరసేక్షణ! చూడ నొప్పగుం
భూనుతవైభవంబు మణిపూరపురంబు సమస్తవస్తుసం
తానసమగ్రమై సతతదానఝరీద్విరదైకవాసమై
మానవతీకటాక్షసుమనవవిభ్రమరత్నదీప్తియై(?).

క. ఏలానిలసంవాసిత
వేలాతటములను నీకు విహరింపంగా
జాలా వేడుక గల్గిన
నీలాలితమూర్తి దక్క నేలుము తన్వీ!

క. పూర్ణేందువదన యత్తటి
దీర్ణఖరీనామనగరి దెలివొందు తదా
కర్ణాక్షులదృగ్దీప్తులు
వర్ణితయువహృత్పతంగవాగుర లరయన్.

గీ. అవని వకుళాభరణయోగి యన ముకుందుఁ
డందుఁ జించాతలంబున నవతరించి
విస్ఫుటంబుగ నర్థముల్ విస్తరించు
ద్రవిళవాగ్రూపవేదవాగ్రత్నములను.

గీ. అప్పురం బేలు రాజులం దర్కకులుఁడు
పేరు లోచనచంద్రుఁడు భీరుమధ్య!
చల్లు నితండు దిగ్వధూస్తనభరముల
భూరినిర్మలకీర్తికర్పూరధూళి.

ఉ. వీని భుజాబలప్రకరవిభ్రమముల్ విపినాధిదేవతల్
గానము సేయుచోఁ దరునికాయము జాతిగ నొత్తుఁ దాళముల్
కానలు దూఱి శాత్రవులు క్రన్ననఁ బాఱెడివేళఁ గొమ్ములన్
మానుగఁ బట్టి గాలి బలుమాఱుఁ జరించుఁ గిరీటకోటిచేన్.

గీ. పసిఁడితీఁగలఁ బోలు నీ బాహుయుగళి
తరుణి! నల్లని వీని పే రురముఁ జేర్పు
దివ్యవాహినీనిజచారుతీరజనిత
కనకవల్లుల నగ్రభాగములఁ బోలి.

చ. ఇతఁడు దశార్ణభూమివిభుఁ డిందునిభానన! వైరిధారుణీ
పతు లితఁ డన్న శైలవనపార్శ్వములందు వసింతు రెప్పుడున్
రతిపతిభాసమాను నుడురాజయశున్ మృగరాజవిక్రమున్
గుతుక మెలర్పఁగా నితనిఁ గోరి వరింపుము నీకు నింపగున్.

వ. ఇట్లు సఖీజనంబులు పురికొల్ప నొల్లకుండిన ముందఱికిం బోనిచ్చి.

శా. చోళద్రావిడపాండ్యరాజ్యమహిభృచ్ఛుద్ధాంతకాంతాపయః
కేలీసక్తతదంగరాగితకురంగీనాభినీలీభవ
ల్లీలావారిభరాభిరామమయకాళిందీనదిం బోలుచుం
గ్రాలుం భూనవవేణికావిధమునం గావేరి లీలావతీ!

గీ. వేడ్కఁ బాండ్యాంగనలు కేళివేళలందు
నాతమనతనాభిపీతంబు లైనవానిఁ
గరుణవక్షోజభరలబ్ధి గ్రమ్మరించి
తూర్పు నడపింతు రయ్యేటి తోయములను.

ఉ. మంగళదివ్యమూర్తికి రమాకుచకుంభపటీరవాసనా
చంగితతారువక్షునకు సర్వచరాచరభూతభర్త కు
త్తుంగభుజంగశాయికిఁ జతుర్భుజభాసికి నున్కిపట్టు శ్రీ
రంగము చూడనొప్పగుఁ గురంగవిలోచన! తత్తటంబునన్.

గీ. రమణి కయ్యేటి కనతిదూరంబునందు
నొట్టుకొని పొల్చు శ్రీరంగపట్టణంబు
దాన్ని వీక్షించి సురదేవతాపురంబు
నేఁడు తప మున్నదదె మరున్నిలయమునను.

మ. ద్విపకుంభస్తని! రాజు తన్నగరికిన్ విం దమ్మహీనాకలో
కపతిం కేసరకేతుఁ డందు రవనిం గల్పించె నేతత్ప్రతా
పపతంగుండు గళిందజన్ విమతరాట్పద్మాననాదృక్పుటీ
నిపతత్సాంజనభాక్సరన్మిషమున న్నిర్యంత్రణప్రక్రియన్.

చ. పడతి! సవర్ణభావమహిమం దెమలించు భవత్కరంబు లి
ప్పుడ తనరారు నీనృపతిపుంగవుహస్తముతోడఁ గూర్చెదేఁ
బడిబడి మానసంబులనుఁ బ్రాకెడి రాగలతామతల్లికిన్
బొడమిన పల్లవద్వితయభూతి నొనర్పదె వేయినేఁటికిన్.

ఉ. కాంచనవప్రదీధితినికాయముచే వసుధావధూటి క
భ్యంచితకుంకుమచ్ఛదనభంగి ముఖంబున నత్తుకొల్పుచున్
జంచలనేత్రి! దక్షిణదిశాస్థలిఁ జూడఁగ నొప్పు నెంతయున్
గాంచి యనంగఁ బట్టణ మఖండమహామహిమాభిరామమై.

మ. ప్రవహించు న్నిరతంబు తత్పురవరప్రాంతక్షమావీథి వే
గవతీనామతరంగిణీతటి జగత్కల్యాణి ప్రాతఃశుచి
ప్లవఖేలద్రవిళాంగనాకుచతటీపర్యస్తకస్తూరికా
ద్రవచర్చావిలవారిపుర యగుచున్ రాజీవపత్రేక్షణా!

క. కలహాంతరితాకృతిఁ గోమలి!
పొలుచుఁ దదంతికమున మజ్జద్ద్రవిళీ
లలితఘనస్తనఘుస్రణా
విలవీచిక యగుచుఁ దటిని వేగవతి యనన్.

ఉ. భూపకుమారి! యప్పురి ప్రఫుల్లకుశేశయపత్రలోచనో
ద్దీపితవక్త్రపద్మములఁ దీటు మదిం దలపోసి చువ్వె తా
రాపతిరామమేరుశిఖరంబులఁ దోచు పయోధివీచులం
బ్రాపితదుష్కళంక మని పల్మరు నాత్మతనూగుళుచ్ఛముల్.

శా. కంపాసైకతవేదికాస్థలముల్ గ్రాలున్ గ్రతుధ్వంసి నై
లింపక్ష్మాధరచాపుఁ డైందవకళాలీలావతంసుండు దృ
క్సంపోద్భర్జితమీనకేతుఁడు జటాజాగ్రద్వియద్వాహినీ
ఝంపావీచిభరాకులాఖిలదిశాజాలుండు లీలావతీ!

గీ. అప్పురం బేలు నధినాథుఁ డతివ యితఁడు
అహరహంబున వాగ్గదండవాహవీని (?)
దానవారి భజింపు సంతతము దీవ్ర
హస్తశక్తులఁ బెట్టి ముక్తావలతను.

క. సానంగశీతలం బగు
నీ నిరుపమదృష్టి వీవి నెఱిఁ జూచెదవే
మానిని! వీనికిఁ గాంచీ
మానవతీవిభ్రమములు మఱపొందించున్.

వ. ఆ దాదిపట్టియు వేఱొక రాజసుందరుం జూపి.

ఉ. ఉజ్జయినీశుఁ డితని మహోన్నతియుం బృథువిక్రమంబు సం
పజ్జయలక్ష్ము లెన్నఁడును బాయ కురఁస్థలబాహుపీఠముల్
బుజ్జన సేయుచుండుటయె పోడిఁమిగా జగమెల్లఁ జాటుఁ జం
చజ్జజాలయతేక్షణ! విశాలము వీని యశంబు చూడఁగన్.

ఈ క్రింది పద్యము నారన సూరనదని యందురు. ఉదయనోదయమున కానరాలేదు. వనమాలివిలాసమున నున్నదేమో.

వేసవిలో మందమారుతము

శా. ఆ కల్లాడ ద దేమొ? నేఁడు పవనుం డాకాశవాపీతటా
శోకాసేకవనాళిఁ గ్రుమ్మరుచు నచ్చో దాఁగెనో లేక గం
గాకల్లోలవతీతరంగముల నూఁగంబోయెనో, లేక కాం
తాకర్పూరకపోలపాళికల నిద్రాసక్తుఁడై యుండెనో.