పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వనమాలివిలాసము

ద్వితీయాశ్వాసము



క. శ్రీరజనీకరధర పద[1]
వారిజ పుష్పంధయీ భవన్మానసక
ర్పూరపటీరసుధారస
హార యశస్సాంద్ర కొండు రక్కమహేంద్రా. 1

వ. అవధరింపు మిట్లరుగుదెంచుచున్న యిన్నారదుం గని డెందం బమందానందంబునఁ గందళింప గోవిందుం డుల్లసితహాసవిలాసభాసురం బగు ముఖవిలాసంబుతో నెదురేఁగి ప్రమదాశ్రువారిపూరంబున గండంబులు గడుగుచుఁ బ్రణమిల్లి
యల్లనల్లన కృతకరావలంబనుం డగుచుఁ గొనివచ్చి యొక్క చొక్కంపుమణిమయాసనంబున నాసీనుం గావించె.... 2

గీ. అపుడు నయమానకోవిదండైన శౌరి
వినయమున సేమ మడిగిన వేల్పుఁదపసి
ధవళతరదంతరుచి ధాళధళ్యముగ ని
జాంగరుచిఁ బ్రోదిసేయ నిట్లనియె హరికి. 9

క. అనపాయి దివ్యకరుణా
జనకం బగు చూడ్కి నీవు శాసింప జగం
బున నేమి గొఱఁత శుభములు
వనజేక్షణ కుశల మున్నవాన మనిశమున్. 10

గీ. భువనములు (సూచు)[2] వేడుకం బూని యేను
ధరఁ జరించుచు నొక యద్భుతంబుఁ గంటి
నహహ యది నీకు నెఱిఁగింతు నను తలఁపున

నలినలోచన నేఁ డిందు నాదురాక. 11

  1. వద
  2. ప్రా.పూరణము