పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తేజంబులకు గని దివిజావళి మొగంబు
వైశ్వానరుం డబ్జవదన వీఁడు
తరిణికూరిమిపట్టి దర్మైకనిరతుండు
వనజాక్షి వీఁడు వైవస్వతుండు
రాత్రించరులకెల్ల రా జేలుఁ గోణంబు
వీఁడు నైరృతి పూర్ణవిధునిభాస్య
పతి పయోనిధులకుఁ బాలించుఁ బడమరఁ
బల్లవాధర వీఁడు పాశధరుఁడు[1]
తే. గంధగజయాన యీతండు గంధవాహుఁ
డీతఁ డలిలనీలవేణి యక్షేశ్వరుండు
చెలువ యీతండు విధుకళాశేఖరుండు
బాల వీక్షింపు వీరె దిక్పాలవరులు. 136

తే. నీలకుంతల కలలోన నీవు గన్న
యతఁడు దిక్పాలురం దొక్కఁ డయ్యెనేని
విబుధకుత్కీలవాస్తవ్యవితతిలోన
రమణి సాఫల్య మగు వాని రాజ్యలక్ష్మి. 137

శా. నీలక్షోణిధరోపమానతను లున్నిద్రప్రతాపాఢ్యు లా
భీలోదగ్రకృపాణపాణులు సమద్భీతామరశ్రేణు లా
శాలావణ్యవిశాలకీర్తులు తపస్సంప్రాపితైశ్వర్యు లో
బాలా చూడుము వీరె దైత్యులు భవద్భాస్వతకటాక్షంబులన్. 138

క. నీకలఁ గాంచినిపురుషుం
డో కోమలి దైత్యులందు నొక్కఁడ యేనిం
గైకొనుఁ వాఁడు మనమున
నాకపురస్త్రీల మోహనశ్రీమహిమన్. 139

గీ. వీరు సిద్ధులు సాధ్యులు వీర లతివ
వీరు యక్షులు రాక్షసుల్ వీర లబల
వీరు గరుడులు గుహ్యకుల్ వీరు వీరు
రమణి గంధర్వవిద్యాధరప్రవరులు. 140

  1. పాశపాణి