పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. నిఖిలభువనైకగణ్యులగు పురుషవరేణ్యుల నెల్లఁ జిత్రలేఖనాపాటవం బేర్పడ లిఖియించిన చిత్రపటంబు చెలికత్తియలచేత నమ్మత్తకాశిని మ్రోల నిలువం బెట్టించి మందస్మితవిరాజమానంబగు ముఖారవిందంబుతో నృపనందనమొగంబున నిజావలోకనంబు నిగుడ్చి వారిం బేరుపేరున కులనామధేయగుణవర్తనంబుల నేర్పరించి చెప్పం దొడంగి యిట్లనియె. 129

మ. మొద లేకంబగుమూర్తియందుఁ దనువుల్ మూఁడై విరాజిల్లు నొ
ప్పిదపున్ మూర్తుల విశ్వమంతయును గల్పింపం(గ రక్షింపఁ)[1]గా
నుదయంబైన మహాత్ములం గమలగర్భోపేంద్రభూతేశులన్
మదవత్కుంజరయాన వీరిఁ గనుఁగొమ్మా నీకటాక్షంబులన్. 130

సీ. పొక్కిట నెత్తమ్మిపూవు పేరురమునఁ
గౌస్తుభాభరణంబు గలుగువాఁడు
శ్రీవల్లభుఁడు మౌళిఁ జిన్నిక్రొన్నెలఱేకు
మణిబంధమున భోగిమందనంబు
గలవాఁడు గిరిరాజకన్యామనోవిభుం
డాననంబులు నాల్గు నఱుత విమల
తరదీర్ఘయజ్ఞసూత్రంబు గలవాఁడు
వాగ్వధూనాథుండు వనజభవుఁడు
తే. వీర లేతన్మహామహీభారభరణ
హరణ నిర్మాణచాతురీహారిమతులు
వీరి మువ్వుర వీక్షింపు విధునిభాస్య
యొప్పిదము లైన తొంగలిరెప్ప లెత్తి. 131

మ. కలశాంభోనిధిలోనఁ బుట్టుక వియత్కల్లోలినీతీరక
ల్పలతామంజునికుంజపుంజములు లీలావాటముల్ కాంచనా
చలకూటంబులు కాపురంబు నెలవుల్ చర్చింప నీనిర్జరా
వళి కెల్లప్పుడు వీరిఁ దేరకొన నోవామాక్షి వీక్షింపుమా. 132

  1. గల్పింప గా