పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. కలఁ గనుఁగొన్న చిత్రములఁగన్నిడి యు ట్లసమాస్త్రు చెయ్దులన్
నిరుపఱి తూలిన న్నగరె నీరజలోచన యెల్లవారు నా
త్మలఁ గడుఁ గుందరే సఖులుఁ దల్లియుఁ దండ్రియుణ బంధుకోటియున్
గులమున కివ్విధంబు సమకూర్పదె[1] యెన్నఁడు లేని నిందలన్. 117

ఉ. నిందకుఁ బాత్రమై బ్రదుకు నీచపు జీవన మిచ్చగింప నొ
ల్లం దను వుజ్జగించెద విలాసిని లే దనుమాన మిందు కే
నిందుకరాంకురంబు లుదయించు తఱిం దరియంగఁజొచ్చి యా
కందువ మావిమోఁకలకుఁగాఁ జని నీడల నిల్చి యోచెలీ. 118

చ. చిలుకకుఁ జెప్పుఁడమ్మ కొదసేయక[2] మాటలు రాజహంసికిం
బలుమఱు నేర్పుఁడమ్మ మురిపంపుగతుల్ నవచూతశాఖికిం
జలములు పోయుఁడమ్మ పనిసందడి దీఱ మఱాక[3] నన్నె కాఁ
దలఁపుచు నుండుఁడమ్మ సతతంబును సన్మణిసాలభంజికన్. 119

క. అని పలికి వెచ్చనూర్చుచు
వనరుహముఖి యూరకుండె వ్రాల్గన్నులఁ జ
ల్లన జాఱునీరు చెక్కులఁ
జినుకఁగ జోటియును కరుణ చిప్పిలు మదితోన్. 120
 
ఉ. బాలిక యేటిమాటలుగఁ బల్కెద వేఁ గలుగంగ నీకు నిం
తేల విచార మె ట్లయిన నెల్లిట నేఁటనొ రాజహంసి దాఁ
బాలును నీరు నేర్పఱుచుభాతిఁ జతుర్జలరాశిమధ్య భూ
పాలకకోటిలో మధురభాషిణి నీపతి నేర్పరించెదన్. 121

ఆ. అనుచు నూరడించి యల్లనఁ గెంగేలఁ
గన్నునీరు దుడిచి కౌఁగిలించి
నెలఁ త యోర్చియుండు నీమనోరథసిద్ధి
నే ఘటింతు నెల్లినేఁటిలోన. 122

  1. సమకూర్చెదె
  2. రొదసేయక
  3. దఱాక