పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మృగావతి తాను కలగన్నవిధంబు చెలుల కెఱింగించుట


ఉ. పైదలి నీవు చెప్పు మని పల్మఱుఁ బల్కఁగఁ జెప్పకుండుటల్
కా దని చెప్పఁబూనుటలు గాని లతాంగి మదీయవాంఛకున్
లే దిది యిన్నమెఱి మది లేశమునుం దయమాలి దైవ మీ
నిందఁబెట్టి ప్రాణముల నెల్వడఁ జేయు దలంపులే చెలీ. 111

ఉ. ముద్దియ యెవ్వఁడో యెఱుఁగ మొన్నఁ బగల్ మణిసౌధవాటి నే
నిద్దురవోవ వచ్చి కల నిర్జరుఁ డొక్కఁడు చిత్రశాటి నా
యొద్దన వచ్చి రూపయుతు నొక్కనిఁ జూపి యితెడు నీకు నో
ముద్దియ వల్లభుం డవి సముద్ధతి నేఁగె వియత్పథంబునన్. 112

చ. నల నలకూబర త్రిదశనాథతనూజ మనోజు లాదిగాఁ
గల మహనీయరూపయుతగాత్రులఁ జెప్పఁగ విన్నదానఁ దో
యిలి యిట్టివారి చిత్రములు వందలు వ్రాయఁగఁ జూతురు గాని నా
కల గనుంగొన్న మూర్తివలెఁ గన్నుల కిం పొదవింపరే చెలీ. 113
 
క. కలరూ పడిగిన నీకుం
గల రూ పెఱిఁగింప కునికి గాదని మదిలోఁ
గల రూ పంతయుఁ జెప్పితిఁ
గలరూ పేర్పఱిచి పుణ్యగతి బొమ్ము చెలీ. 114

చ. తుది యిదియన్న నిశ్చయముతోఁ జని మాయపుఁ జిత్రరూపుపై
మదిఁ దగులంగఁ జేసి వెడమాయల దైవము నన్ను నీక్రియన్
మదనునిబారిఁ ద్రోచె మఱి మానముఁ బ్రాణముఁ బాపు చొప్పుగా
కిది ఫలసిద్ధి గాంచువలపే తలఁపంగఁ జకోరలోచనా. 115

క. కలఁగాంచిన చిత్రములకు
వలవంతలఁ జింతనొందు వా రెందైనం
గలరమ్మ తల్లి ధాత్రీ
స్థలిలో నే నొక్క పాపజాతిం దక్కన్. 116