పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. అక్కట పాలపాపవు గదమ్మ మొదల్ తుది[1] లేని చింత నీ
    కెక్కఁడ గల్గెనమ్మ మరుఁ డెంతయు ద్రోహి గదమ్మ వేదనం
    బొక్కుట కోర్వవమ్మ[2] మును పోకలఁబోయి యెఱుంగవమ్మ మే
    మెక్కడఁ జొత్తుమమ్మ యిఁక నే క్రియఁ బారము చేరెదే చెలీ. 86
 
ఉ. ఇచ్చట నిన్ను నొంటి నిడి యేఁగినఁ బాపము మాకు దద్దయున్
    వచ్చుట నిక్క మమ్మ రతివల్లభుఁ డీశ్వరులోచనాగ్నిచే
    వెచ్చి యనంగభూతమయి వేమరు నీయెలఁదోఁటలోఁ గరం
    బిచ్చఁ జరించునన్న తలఁ పెవ్వరి కప్పుడు దోఁపదే చెలీ. 87

వ. అని పలుకుచు— 88

ఉ. అల్లన లేమఁ బట్టి మెయి నంటిన పుప్పొడిఁ బాయఁదట్టి ధ
    మ్మిల్లము చక్కదోపి వలిమించు చనుంగవఁ దారహారముల్
    మెల్లనఁ జిక్కు లోలి నెడలించి నితంబుమునందు నేర్పు సం
    ధిల్లఁగ జీరఁగట్టి సుదతీజను లెంతయు సంభ్రమంబుతోన్. 89

క. చిగురుంబోఁడికి రక్షగఁ
   జిగురు సురాళించి వైచి శీతాంశుకళం
   దెగడు చెలినొసలఁ దిలకం
   బుగు వడిఁ బుప్పొడి ఘటించి ముదము దలిర్పన్. 90

వ. పల్లవకోమల నల్లనల్లన నిజపాణిపల్లవంబులు కైదండ లిడుచు నడిపించుకొని వచ్చి మును చెప్పినచొప్పునఁ బూఁజప్పరంబులో నప్పటప్పటికిఁ గప్పురగంధులు పన్నీరు గుప్పళించి కిసలయతాళవృంతంబుల విసర నంతకంతకుం జలువ యెక్కి చల్లనై వడగల్లువలె నివతాళించు చంద్రకాంతశిలావేదిపైఁ బఱచిన చిగురాకుం బఱపుమీఁదఁ బువ్వుఁబోఁడిం బవ్వళింపఁజేసి శిశిరోపదకంబులు సేయందొడంగి— 91



  1. మదాతుది
  2. కోర్వరమ్మ