పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిథునంబును గోకకోయిష్టికక్రౌంచకారండవప్రముఖనిఖిలజలపక్షిపక్షవిక్షేపణాక్షీణవిరాగవిరాజితసైకతస్థలంబును నిరంతరవలమానమీనవాలమూలాక్షే(ప)[1]ణక్షిప్తవారిశీకరాసారసంవర్ధితప్రతీరతరులతావితానంబును నగు నొక్కసరోవరంబు సమీపస్థలంబునఁ గుసుమఫలకిసలయకేసరమయపాదికంబులగు తమకొనివచ్చిన శిశిరద్రవ్యంబులు మారుగట్టుమణుంగులునుం బెట్టి స్వేదాపనోదనార్థంబు జలావగాహంబులకుం గడంగి పద్మాకరంబు ప్రవేశించి— 51

జలకేళివర్ణనము


సీ. పదతలంబుల కోటుపడియుఁబోలె విలోల
జలచరంబుల సరోజములు వడఁకఁ
గలికికన్నుల సోయగమున కుల్కియుఁ బోలె
జలచరంబులు వెఱచఱవి పఱవ
నొప్పుఁగుంతలముల కోహటించియుఁ బోలె
నెలఁదుమ్మెదలు మీఁది కెగసి మ్రోయ
గతివిభ్రమములకు గళవళించియుఁ బోలె
బెదరి రాయంచలు రొదలు సేయ
తే. బిగువుఁ జన్నుల కలిమికి బెగడివోలెఁ
దలఁకి జక్కవ లిసుకతిప్పలకుఁ జేరఁ[2]
గొలను గలయంతయును గలగుండు వెట్టి
యెలమిఁ గ్రీడించి రపుడు రాకేందుముఖులు. 52
 
సీ. తోరంపు వలిచన్నుదోయి సోయగమునఁ
దమ్మిమొగ్గలమీఁద దాడివెట్టి
కలికిబిత్తరికన్నుఁగవ విభ్రమంబుల
నిందీవరముల పెంపెల్లఁ జెఱచి

  1. మూలక్ష(...)రోక్షప్త
  2. తిప్పలకు జార