పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తిలకంబుఁ గృగంటఁ దేరిఁజూచుచుఁ గేల
నలవోక యెలమావి నంటికొనుచుఁ
బొలుచుప్రేంకణముల పొంతఁ బాడుచు సారె
చిఱునవ్వు పొన్నపైఁ జిలికికొనుచుఁ
బొకడపై మద్యంబు పుక్కిలింపుచుఁ బాద
తలమెత్తి కంకేళి దాచికొనుచు
సిందువారమ్ముల చెంతల నూర్చుచుఁ
గొండగోగులనీడ గొణఁగికొనుచు
తే. నెమ్మిఁ గౌఁగిటఁ గ్రోవి మన్నించికొనుచు
హేమపుష్పంబుమ్రోల మో మెత్తికొనుచు
నల్ల విహరించె విరులాస నతివయోర్తు
విటుల ధనమాన భ్రమియించు వేశ్యవోలె.41

చ. తనియఁగఁ బూచె నొక్క సతి దన్న నశోకము నవ్వఁ బొన్నయుం
గనఁ దిలకంబు ముట్ట సహకారము పల్కుల గోఁగు పాటఁ బ్రేం
కణ మదలింపఁ జంపకము కల్లుమియ న్వకుళంబు కౌఁగిటం
బెనుపఁ గురంటకం బలత పెంపున[1] నూర్చఁగ సిందువారమున్. 42
 
మ. మెడహారమ్ములు దూలఁ గుండలరుచుల్ మీటింపఁ జెక్కిళ్ళపై
బడుగున్గౌను వడంక నొండొకటితోఁ బాలిండ్లు రాపాడఁ గ్రొ
మ్ముడి వీడంగఁ బదాంగదంబు లులియ న్మున్నాడి పూఁబోఁడులం
గడవంబాఱి యొకర్తు గోసె మదివేడ్కల్ మూరిఁబోఁగ్రొవ్విరుల్. 43

చ. కురు లలిపంక్తి చేతులు చిగుళ్ళు దరస్మితముల్ ప్రసూనముల్
గురకుచకుంభము ల్గుసుమగుచ్ఛము లంగము పూవుఁదీఁగె మైఁ
దొరఁగు శ్రమాంబుపూరము మధూళిక యన్ విచికిత్సఁ జేయఁ జూ
పర కొకలేమ గోసెఁ గనుపట్టు వనాంతలతాలతాంతముల్[2]. 44
 
వ. మఱియును— 45



  1. బనుపగురంటకంబు లత పెంపున
  2. గనుపట్టున తాంతలతాలతాంతముల్