పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. ధరణీనాథ ప్రసిద్ధ మిమ్మహి నయోధ్యాపట్టణం బప్పురిం
బరిపాలించుచు నున్నవాఁ డిపుడు శుంభత్ప్రౌఢబాహాబల
స్ఫురణం దాఁ గృతవర్మనా నృపతి యబ్భూపాలు గారాపుఁబ
ట్టి రమానందను రాజ్యలక్ష్మియనఁ బాటిల్లున్ మనోజ్ఞాకృతిన్. 13

గీ. దానిపేరు మృగావతి మానవేంద్ర
లాలితానన్యరేఖావిలాసలబ్ధి
నది మనోజాతు నాఱవయమ్ము వోలెఁ
జూడ్కులకు వేడ్క నొదవించుఁ జూపఱకును. 14

ఉ. ఆయెలఁదీఁగఁ బోఁడి వినయంబుఁ బ్రియంబు నిజాప్తకోటికిం
జేయుచుఁ దల్లిదండ్రుల కశేషమనోభిమతైకసిద్ధి నా
నాయతనంబులోనఁ దనరారుచు శైశవచాపలస్థితిం
ద్రోయఁగ నాఁడునాఁటికిని దూఁకొనె జవ్వన మంగవల్లికన్. 15

ఉ. భోగవిహారవాటి పరిపూర్ణకళామణిపేటి గర్వరే
ఖాగుణజన్మభూమి మదగౌరవమల్లఖళూరి బంధుహృ
ద్రాగరసాబ్ధి వేలరతిరాజమనోహరసిద్ధి యౌవన
శ్రీ గనుపట్టె మానిని కశేషవిలాసవిశేషలబ్ధితోన్. 16

సీ. నీలనీలంబులై నిటలభాగంబు కై
సేసిన కుంతలశ్రేణితోడ
భారభారంబులై బాహుమధ్యంబున
గిరిగొన్న గురుకుచగిరులతోడ
శోణశోణంబులై సుకుమారతాప్రౌఢిఁ
దనరెడు పాణిపాదములతోడ
నవ్యనవ్యంబులై నాసికాహ్లాదంబుఁ
బాటించు తనుసౌరభములతోడ
ఆ. నాతి యొప్పె యౌవనస్ఫూర్తిరోలంబ
వల్లరీలసత్ప్రవాళకుసుమ
సురభిగంధములను జూపట్టుచును[1] వైభ
వమున మీఱు పుష్పవల్లివోలె. 17



  1. జూపట్టిమను