పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. యాలతాంగితోడ ననువాసరంబును
గూడిమాడి వేడ్క[1] గొనలుసాఁగఁ
గడవ నెఱుఁగ[2]రాని కడ లొత్తు రతివార్ధి
నెలమి నోలలాడు టెన్నఁడొక్కొ. 172
 
శా. ప్రాలంబంబుల చిక్కెడల్చు[3] కపటోపాయంబునం జొక్కపుం
బాలిం డ్లల్లనఁ గేల నంటునెడలం బ్రాపించురోమాంచముల్
బాలారత్నము భావరత్యనుమతం బైపై నెఱింగింపఁగా[4]
నాలీలావతిఁ గౌఁగిటన్ మెలపుమై హత్తించు టిం కెన్నఁడో. 173
 
ఉ. అద్దములోన మాటికి నిజాధరపాళిక మీటి నెయ్యపుం
దిద్దులు చూచుచున్నతఱి నేఁ జిఱునవ్వునఁ జేరవచ్చినన్
ముద్దియ సిగ్గునం జిగురుమోవికిఁ గే లెడ మాటుసేయుచుం
దద్దయుఁ గన్నుఁగోనల నదల్పఁగ నెన్నఁడు చూడఁగల్గునో. 174

ఉ. చేతివిలాసపద్మమునఁ జేడియ వ్రేసినఁ గంటిలోనఁ గం
జాతపరాగ మొల్కె నని సారెకు మాయలు సేసి చేరి య
న్నాతి నిజాననానిలమునన్ నయనాంబుజ మూఁద నవ్వుచున్
వాతెఱ ముద్దువెట్టుకొను వైభవ మెన్నఁడు నాకుఁ గల్గునో. 175

ఉ. హారము లెవ్వరైన వెలయాడఁగఁ బిల్చిరె[5] నిన్ను నీదు వా
లారునఖంబు చూచి వెఱ పయ్యెడు నిప్పటినుండి చాలు[6] నీ
బేరము లట్ల యుండు మని బింకపుఁజన్ను లలంతి నవ్వుతోఁ
జీరచెఱంగునం బొదువు చేడియ నెన్నఁడు చూఁచువాఁడనో. 176



  1. గూడి రూఢి లెడ్డ; గూడి కూర్మియెడ్డ
  2. కడవఱంగ
  3. చిక్కెడల్చి
  4. బైపై నిరూపింపంగా
  5. లెవ్వడైన వెలయాడగ బిర్విరె
  6. నప్పుడు నుండి చాట